సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం…మహారాష్ట్రకు చెందిన శ్రీకృష్ణ బాబన్‌రావు పవార్(43), రమాకాంత్ జీవన్ ధనావత్(30) అమాయకులైన నిరుద్యోగులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో టెలీగ్రామ్స్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మెసేజ్‌లు పంపుతారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల టెలీగ్రామ్ మెసేజ్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. సదరు వ్యక్తి సందేశంలో ఉన్న సూచనల మేరకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసి, రిజిస్టర్ అయ్యాడు.
అయితే తమ కంపెనీలో చిన్నమొత్తంలో పెట్టుబడి పెడితే.. వెంటనే రాబడి ఉంటుందని నిందితులు చెప్పడంతో అది నమ్మిన బాధితుడు.. మొదట చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టగా, దానికి వెంటనే రాబడి వచ్చింది. దీంతో నమ్మకం పెరిగిన బాధితుడు అధిక పెట్టుబడి పెట్టడంతో కొన్ని రోజులు రాబడి వచ్చింది. ఈ క్రమంలో బాధితుడు రూ.1.61 కోట్లు వరకు పెట్టుబడి పెట్టడంతో బాధితుడికి రాబడి రూపంలో వచ్చిన డబ్బులు వెబ్సైట్లో చూపించాయి. కానీ వాటిని విత్‌డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నగర సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెట్టుబడుల పేరుతో అధిక రాబడి ఆశచూపే నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దురాశకు వెళ్లి మోసపోవద్దని డీసీపీ కవిత ప్రజలకు సూచించారు.