సిటీబ్యూరో, మార్చ్ 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న షహబాజ్ఖాన్, అర్బాజ్‌ఖాన్, షహెద్ఖాన్లు పోలీసులకు చిక్కడం లేదు. రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ కొడుకులు కావడంతో నేరచరిత్ర ఉన్న కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ప్రజాశాంతికి ముప్పుగా మారిన ఈ నిందితుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బహుమతి కూడా ఇస్తామని డీసీపీ ఖారె కిరణ్ ప్రకటించారు.
నిందితులకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ హైదరాబాద్ పోలీసులు రౌడీయిజంపై జీరో టాలరెన్స్ హెచ్చరికలు జారీ చేశారు. కాగా గత సోమవారం రాత్రి శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరుగురు వ్యక్తులు కర్రలతో హల్చల్ చేశారు. దారిలో ఉన్న ద్విచక్రవాహనాలను ధ్వంసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. నెల క్రితమే కాలాపత్తర్‌లో ఓ దుకాణంపై కొందరు రౌడీషీటర్లు దాడి చేసి హంగామా చేశారు. చాదర్‌ఘాట్ ముస్లిం మెటర్నటీ హాస్పిటల్ దగ్గర మొబైల్‌ఫోన్ అడిగితే ఇవ్వలేదని కొబ్బరి బోండాల కత్తితో హల్చల్ చేశారు.
వీరంతా నగర బహిష్కరణకు గురైన అసద్ మనుషులుగా పోలీసులు గుర్తించారు. టప్పచబూత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా రెండురోజులు రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల వద్ద బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ముగ్గురు రౌడీషీటర్లు అడ్డగించారు. సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమె భర్తపై దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా, కానిస్టేబుైళ్లపై సైతం రౌడీషీటర్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో ఇదే ప్రాంతంలో ఓ రౌడీషీటర్ మరో మాజీ రౌడీషీటర్‌పై కత్తులతో దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి.
రాజధాని పరిధిలో సుమారు 1600 మంది రౌడీషీటర్లుంటారు. వీరిలో ఎక్కువగా గోల్కొండ, చార్మినార్ జోన్లలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొందరు రౌడీషీటర్లు గంజాయి స్మగ్లింగ్, స్థిరాస్తి వ్యాపారంలోకి మారారు. లా అండ్ ఆర్డర్, ఎస్బీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరి కదలికలను గమనిస్తున్నారు. కొందరి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నా, ఖాతరు చేయకుండా దందాలకు పాల్పడుతున్నవారు పాతబస్తీలో సుమారు 74మంది ఉంటారని పోలీసులు చెప్పారు. నగరంలో మొత్తం 5 నుంచి 6వేల మంది పాత నేరస్తులున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
అయితే పాతబస్తీలో ఆ ఇద్దరు రౌడీషీటర్లే ప్రధాన టార్గెట్‌గా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. జాఫర్, అయూబ్‌ఖాన్‌లు కుటుంబాలతో సహా నేరచరిత్ర కలిగిన వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ జోన్లో జనవరిలో జరిగిన ఓ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పాతబస్తీలోని రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించారు. అయూబ్‌ఖాన్ ఆయన కుమారులు పరారీలో ఉండడంతో వారి విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఈ నలుగురిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా అయూబ్‌ఖాన్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.
పాతబస్తీలోని పలు పోలీస్స్టేషన్లలో దళారీదందా కొనసాగుతోంది. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే, పోలీసులకు ఫిర్యాదు వస్తుంది. ఆ తర్వాత ఇరుపక్షాల నుంచి దళారులు ప్రవేశిస్తారు. పంచాయతీ తర్వాత సెటిల్ చేసుకోమని చెబుతారు. ఒకవేళ సెట్ కాకపోతే పోలీసుల సహకారంతో ఇంటరాగేషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి తమదైన పద్ధతిలో వారికి చుక్కలు చూపిస్తారు. రెండురోజుల క్రితం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో జరిగిన గొడవలో దళారులు జోక్యం చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ దళారులతో కుమ్మక్కై దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద కేసులైతే లక్షల్లోనే కొల్లగొడుతున్నారని సీపీకే స్థానిక ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.