Saroornagar | ఆర్కే పురం, ఏప్రిల్ 18 : అధికారుల మధ్య సమన్వయ లోపం స్థానికుల పాలిట శాపంగా మారింది. రాకపోకలకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కాలనీలోని నూతన రోడ్లను వేస్తామని చెప్పి ఉన్న రోడ్లను తవ్వి తరువాత పట్టించుకోకపోవడంతో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
సరూర్‌నగర్ బస్టాప్ పక్క కాలనీలో గత మూడు నెలల క్రితం అభివృద్ధి పేరుతో కాలనీలోని రోడ్డును తవ్వి వదిలేశారు. అయితే ప్రస్తుతం ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జరుగుతున్న పనులు కూడా నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు రాకపోకలకు అనేక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు తవ్వి వదిలిన రోడ్డుపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇలా ఎంతకాలమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
త్వరితగతిన రోడ్డు వేస్తే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా చేసేందుకు వీలుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. లేకుంటే నిత్యం ప్రమాదాల బారిన పడి గాయాల పాలవడం తప్పదని తెలుపుతున్నారు. అంతేకాకుండా వర్షం పడ్డప్పుడు కాలనీ రోడ్లు మొత్తం చిత్తడి చిత్తడిగా మారుతున్నాయన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదిస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం స్థానికులు పేర్కొంటున్నారు. స్థానిక కార్పోరేటర్‌ను సంప్రదిస్తే కాంట్రాక్టర్ వల్ల పనులు లేట్ అవుతున్నాయని త్వరలోనే రోడ్డు పనులు చేయిస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు పనుల నిమిత్తం తవ్విన రోడ్డుతో పాటు డ్రైనేజీలపై మూతలను తొలగించడంతో రాత్రి సమయంలో తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద తీవ్రంగా మారిందని తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన రోడ్డు పనులు చేపట్టి ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.