మేడ్చల్, జనవరి 31: లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కు చెందిన పంపాడ్ సంగమేశ్వర్(21) డ్రైవర్‌గా వృత్తి నిర్వహిస్తూ నగరంలోని అంబర్‌పేటలో ఉంటున్నాడు.
మార్కెటింగ్ వ్యాపారి శికారి సుభాష్‌తో కలిసి గురువారం రాత్రి కారులో బాహ్య వలయ రహదారిపై శామీర్‌పేట నుంచి దుండిగల్‌కు వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న కారు మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని, సంగమేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అతనితో కలిసి ప్రయాణం చేస్తున్న సుభాష్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, క్షతగాత్రుడు సుభాష్‌ను చికిత్స నిమిత్తం తరలించగా, సంగమేశ్వర్ మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.