బంజారాహిల్స్,ఏప్రిల్ 16: సుమారు రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను షేక్ పేట్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్ పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్. 12 పోలీస్ కమాండ్ కంట్రోల్ పక్కన సర్వే నంబర్ 403లోని టీ ఎస్ నంబర్..5, బ్లాక్ హెచ్ వార్డ్ 10లోకి వచ్చే సుమారు 3వేల గజాల స్థలాన్ని ప్రైవేట్ స్థలం అంటూ కొంతమంది వ్యక్తులు కొన్ని రోజులుగా చదును చేస్తున్నారు.
సమాచారం అందుకున్న షేక్ పేట్ మండల తహసీల్దార్ అనితారెడ్డి ఆదేశాలతో బుధవారం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆక్రమణలు కూల్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదిగా ఉందని, స్థలంలోకి ప్రవేశించిన వారిపై చర్యలు ఉంటాయని తహసీల్దార్ అనితారెడ్డి హెచ్చరించారు.