దుండిగల్, మే 3: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలో మండల తహసీల్దార్ అధికారులు శనివారం చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. గాజులరామారం సర్వేనెంబర్ 79/1, హెచ్ఏఎల్ కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొంతకాలం కిందట పలువురు ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనిపై గాజులరామారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఆలయంతో పాటు ప్రభుత్వ భూమిలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు శనివారం నాడు జేసీబీ తీసుకెళ్లి కూల్చివేతలు చేపట్టారు.
ఈ కూల్చివేతలపై పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ అడ్డుకున్నారు. అయినప్పటికీ జేసీబీతో ఆలయం చుట్టూ వెలసిన నిర్మాణాలను నేలమట్టం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు జేసీబీకి అడ్డుపడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన జగద్గిరిగుట్ట పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఆలయ గదులు, నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలపై తమ పేర్లు పెట్టలేదని పలువురు రాజకీయ నాయకులు ఆలయ నిర్వాహకులను కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆ కక్షతోనే ఆలయ నిర్మాణాలను కూల్చివేయించారని ఆరోపించారు.