బంజారాహిల్స్,మే 13: వేరే ప్రాంతానికి చెందిన ఇంటిస్థలం పత్రాలను చూపించి ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకున్న నిర్మాణదారులకు రెవెన్యూశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లోని మిథిలానగర్ కాలనీలో గున్నా జైదీప్‌రెడ్డి, గున్నా సందీప్రెడ్డిలకు చెందిన 1200 గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం శివరాజ్ ఠాకూర్ అనే బిల్డర్ భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నాడు. కాగా ఈ స్థలం పక్కనే ఉదయ్‌నగర్ నాలా ఉండడంతో నీటి పారుదలశాఖ నుంచి ఎన్వోసీ కూడా తీసుకున్నారు. కాగా ఈ స్థలం చుట్టూ నాలాను ఆనుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు ఫిర్యాదులు చేయడంతో నమస్తే తెలంగాణ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారంలో లోతుగా పరిశీలన చేపట్టగా సర్వే నంబర్ 403లోని ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిన సమయంలో రెవెన్యూ క్లియరెన్స్ లేకుండా, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయకుండానే నీటిపారుదల శాఖ అధికారులు నాలా బఫర్ జోన్ కేవలం 3.70 మీటర్లే అంటూ ఎన్వోసీ జారీ చేసినట్లు బయటపడింది.
ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణ కథనాలతో రంగంలోకి దిగిన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు స్థలాన్ని పరిశీలించగా శివరాజ్ ఠాకూర్ అనే బిల్డర్ అనుమతి తీసుకున్న స్థలంలో 950 గజాల స్థలం సర్వే నెంబర్ 403లోని టీఎస్-నెంబర్ 2,వార్డు -11, బ్లాక్-ఎస్‌లోకి వస్తుందని, టీఎస్ఎల్ఆర్ ప్రకారం ఈ స్థలం మొత్తం ప్రభుత్వానిదే అని తేలడంతతో అక్కడి ఆక్రమణలను తొలగించి,, ఖాళీ చేయాలని సెక్షన్ 7 ఆఫ్ ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్ కింద మంగళవారం నోటీసులు జారీ చేశారు. స్థలం యజమానులు నోటీసులు స్వీకరించకపోవడంతో ఇంటికి అంటించారు. వారం రోజుల్లో ఆక్రమణలు తొలగించకపోతే తామే వాటిని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.