సిటీబ్యూరో: ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డియే కారణమని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టిందన్నారు. ఇంటి అద్దె, ఆటో కిస్తీలు, పిల్లలు చదువు, కుటుంబ అవసరాలు సమకూర్చుకోలేక ఆటో డ్రైవర్లు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80కి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు.
బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ మేడ్జల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వేముల మారయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి రూ.12 వేలు ఇస్తానని మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు కొత్తగా డీజిల్ ఆటోలను ఔటర్ రోడ్డు బయటకు పంపించాలనుకుంటుందని.. అయితే వాటి స్థానంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.