సైదాబాద్, జూన్ 9 : తెలంగాణాకు వరప్రదాయిని అయిన సింగరేణి కాలరీస్‌ను అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని. విచ్చలవిడిగా బోగ్గు దోపిడికి పాల్పడుతున్నాడని, అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన మాజీ ఎంపీ బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను మంగళవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్, ఏనుగు రవీందర్ రెడ్డి, న్యాయవాది లక్ష్మన్‌తో కలిసి ములాఖత్‌లో పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్ మరో ప్రజా యుద్దానికి తయారైనట్లుగా ఉద్యమ స్ఫూర్తితో సిద్దంగా ఉన్నాడని, అక్రమ కేసులతో నిర్భంధంలో పెట్టినప్పటికీ ఏమాత్రం ధైర్యంకకోల్పోకుండా సింగరేణి ప్రజల కోసం ప్రజాపోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. సింగరేణి కుంభకోణాలపై కేంద్రం స్పందించటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తన దోపిడికి వనరులుగా మార్చుకుని ప్రతి దాంట్లో దోపిడికి పాల్పడుతుందన్నారు. సింగరేణి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నాలుగుకోట్ల ప్రజలు ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు.