శంషాబాద్ రూరల్, ఆగస్టు 2: శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలో బుల్లెట్‌ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు 650 భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, వారి భూముల్లో అధికారులు బలవంతంగా ఫెన్సింగ్ వేసిన విషయం విదితమే. అయితే రైతులు ప్రభుత్వ చర్యను నిరసిస్తూ గత మూడు రోజులుగా నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం శంషాబాద్ సీఐ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు బహదూర్‌గూడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతుల నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు యత్నించడంతోపాటు, రైతులు ఏర్పాటు చేసుకొన్న ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బందితో తొలగించారు. గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నదని, ఇక్కడ దీక్షలు చేయడానికి ఎలాంటి అనుమతి లేదని, ఎవరైనా దీక్షలు చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ రైతుల అక్కడే దీక్షలకు మళ్లీ పూనుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ జీవనాధారణమైన భూములను బలవంతగా తీసుకోవడమే కాకుండా తమను భయపెట్టాలని చూస్తే తాము భయపడేది లేదని పలువురు రైతులు స్పష్టంచేశారు. పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తే తాము భయపడమని తెలిపారు. దీక్ష కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కు తగ్గమని పేర్కొన్నారు. తమ భూములు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బహదూర్‌గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని పోలీసులు గూడాలు వేసుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్సైతోపాటు పలువురు సిబ్బందిని అక్కడే గస్తీకి ఉంచారు. పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడంపై గ్రామ రైతులు మండిపడుతున్నారు. తమను భయపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీసులతో పికెట్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా తమ భూములు సాధించేవరకు పోరాటం ఆపమని తేల్చి చెప్తుతున్నారు.