అగ్ర కథానాయకుడు చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. నాటి ‘నకిలీ మనిషి’ నుంచి ‘ఖైదీనంబర్ 150’ వరకూ చాలా సినిమాల్లో డ్యూయెల్ రోల్స్‌తో అదరగొట్టారాయన. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో కూడా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మెగాస్టార్‌ని కొత్తగా చూపించాలనే తపనతో దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) తయారు చేసుకున్న కథ ఇది. ఇందులో చిరంజీవి పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే.. ఇందులో చిరంజీవి తండ్రి, కొడుకులుగా కనిపిస్తారని తెలిసింది.
ఈకథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయట. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు, బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా శరవేగంతో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న విడుదల చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.