Dasoju Shravan kumar | తెలంగాణ భవన్ ఉద్యమాల వేదిక ..పోరాటానికి ప్రతిరూపమైన వేదిక.. కుక్క కాటుకు చెప్ప దెబ్బ అనే కాంగ్రెస్ నేతల పిచ్చి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ పిచ్చోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కేసీఆర్ అంటుంటారు. కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీశ్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమే.. కాంగ్రెస్ నేతలు అత్యంత నీచానికి పాల్పడుతున్నారు.. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా రేవంత్ హయాంలో గాంధీ భవన్‌ను బూతుల అడ్డాగా మార్చారు. గాంధీ వచ్చి కూర్చున్న భవన్‌ను అపవిత్రంగా మార్చారన్నారు.
సెక్యులరిజం భావనను కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేస్తున్నారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు అని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. హిందువులను అగౌరవ పరుస్తున్నారు.. శివతత్వాన్ని అవమానపరుస్తున్నారని దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ చండీ యాగం చేశారు. ప్రజలు చెడిపోవడం కోసం పూజలు ఎన్నడూ చేయలేదు. ఎన్ఠీఆర్ మీద కూడా శవపూజ చేశారని ఇలాంటి వారే దుష్ప్రచారం చేశారు. హరీశ్ రావు అనేక అంశాల మీద ప్రభుత్వం పై పోరాడుతున్నారు. అందుకే హరీష్ రావు మీద కక్ష గట్టి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావు శివమొగ్గ ముఖంబికా ఆలయాన్ని సందర్శించుకుంటే క్షుద్ర పూజలు చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ముఖాంభికా దేవి ఎవరు.. ? శక్తి స్వరూపిణి ..అమ్మ వారిని రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్ నేతల నోళ్లు పడిపోతాయని దాసోజు హెచ్చరించారు.
విజయ్ కూడా క్షుద్ర పూజలు చేశారా ..?
రేవంత్ రెడ్డే అద్దంకి, సామ రామ్మోహన్ రెడ్డితో క్షుద్ర పూజలు అని మాట్లాడిస్తున్నారు. శివమొగ్గ ఆది శంకరాచార్యులు తిరగాడిన అత్యంత పవిత్ర ప్రాంతం.. తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ తో ఉన్నారు.. ఆయన కూడాముఖంబికా దేవాలయం వెళ్లారు.. విజయ్ కూడా క్షుద్ర పూజలు చేశారా ..? అని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య ,శివకుమార్ కూడా అనేక గుడులు తిరుగుతున్నారు.. వాళ్లు కూడా క్షుద్రపూజలు చేస్తున్నారా..? రేవంత్ కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారని ప్రచారం ఉంది.. ఉత్తమ్ ,భట్టి ల ప్రభావం తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలు చేశారు అనగలం.. రేవంత్ క్షుద్ర పూజలు చేశారు కనుకే 2034 దాకా సీఎం గా ఉంటానని అంటున్నారా ? …హరీష్ రావు పై క్షుద్ర పూజల ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి ,మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాని దాసోజు డిమాండ్ చేశారు.
ప్రముఖులు మాట్లాడిన గాంధీ భవన్ వేదికను క్షుద్ర పూజలంటూ హీనంగా మార్చినందుకు సిగ్గుపడాలన్నారు దాసోజు. తొండల భాష ,పేగుల భాష నుంచి క్షుద్ర పూజల స్థాయికి దిగజార్చారు. ప్రజలతోనే కాదు అమ్మ వారితో పెట్టుకున్నారు. ఇక వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. శాస్త్రీయ దృక్పథాన్ని మరిచి క్షుద్ర పూజలు అని చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీ స్థాయిని దిగజార్చారన్నారు.
LIVE: MLC @sravandasoju Press Meet at Telangana Bhavanhttps://t.co/POaWb2P3VB
— BRS Party (@BRSparty) August 3, 2026
.