సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ జీతాల కోసం కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించాల్సి ఉందని, సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే పెనాల్టీ చార్జీల అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు బౌన్స్ కావడంతో బ్యాంకు ఖాతా సిబిల్ రేట్లు కూడా పడిపోతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు ప్రతి నెలా రూ. 100 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు అసలు మిత్తీలను చెల్లిస్తున్నందున ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆగస్టు మాసం జీతాలు ఇంకా అందలేదు. ప్రతి నెలా 1న క్రెడిట్ అయ్యే జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇప్పించాలని పలు యూనియన్ల నేతలు సైతం ఫైనాన్స్ విభాగాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, మరో 24వేల మంది ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లతో కలిసి ప్రతి నెలా రూ.136 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పెండింగ్‌పై రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతుండటం గమనార్హం.