GHMC | కవాడిగూడ, మే 31 : హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలోని బీమా మైదాన్ వాంబే కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలని.. లేదంటే ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు అక్కడకు వచ్చిన స్థానిక కార్పొరేటర్ రచనశ్రీని అడ్డుకున్నారు. తమకు ఎవరిపైనా నమ్మకం లేదని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి నోటీసులకు స్పందించి, ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానిక మహిళలు తేల్చిచెప్పారు.
జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కట్టిన 18 ఏండ్లకే ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని బస్తీ మహిళలు తెలిపారు. వెంటనే నిధులు కేటాయించి తమ ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వాంబే ఇళ్లతో పాటు ఇతర బస్తీలలో జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం నోటీసులు అందజేశారు. దీంతో నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులను బస్తీవాసులు చుట్టుముట్టారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ పనిచేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎలా అని వారు ప్రశ్నించారు. అవసరమైతే ఇక్కడే చస్తాం కానీ ఇళ్ళు మాత్రం ఖాళీ చేసేదే లేదని స్పష్టం చేశారు. వెంటనే ఖాళీ చేయాలని మీకు ఇచ్చిన నోటీసుల్లో లేదని వెంటనే మరమ్మతులు చేసుకోవాలని లేనట్లియితే ఇళ్ళను ఖాళీ చేయాలని ఉందని అధికారులు, కార్పొరేటర్ వివరించడంతో బస్తీవాసులు, స్థానిక మహిళలు శాంతించారు.