హెచ్ఎండీఏ చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రెడ్ సిగ్నల్ పడుతోంది. భూసేకరణ ఇబ్బందులు, వందలాది ఎకరాల వ్యవసాయ భూములను రోడ్లుగా మార్చడంపై రైతుల నుంచి తీవ్ర విముఖత వ్యక్తమవుతున్నది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ పూనుకోవడంతో.. ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఇటీవల కోకాపేట నియోపోలిస్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి వరకు నిర్మించనున్న 52 కిలోమీటర్లపై పొడవైన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును రైతులు వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున్న రైతుల నుంచి వస్తున్న ప్రతిఘటన హెచ్ఎండీఏకు ఇబ్బందిగా మారుతున్నది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
సాగు భూములను బలిపీఠమెక్కించేలా..
సాగు భూములను బలిపీఠమెక్కించేలా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు మధ్య గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో నగరం నలు వైపులా 10 రేడియల్ రోడ్లు రానుండగా… ఇప్పటికే రేడియల్ రోడ్-1ను ఫ్యూచర్ సిటీ మార్గంలో నిర్మించనున్నారు. తాజాగా ఔటర్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల్ వరకు రేడియల్ రోడ్డు-2ను నిర్మించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మీటర్ల వెడల్పుతో సుమారు 52కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డు కోసం శంషాబాద్, షాబాద్, కొందుర్గ్, చౌదర్గూడెం, మెయినాబాద్, పరిగి మండలాల పరిధిలోని 25గ్రామాల్లోని వ్యవసాయ భూముల సేకరణకు సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రైతుల విముఖత
రెండు పంటలు పండే సాగు భూములను కేవలం రోడ్ల కోసం ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. వారసత్వంగా వస్తున్న భూములపై ఆధారపడి సాగు చేస్తూ జీవనోపాధిని పొందుతున్న వారికి ఈ భూములే కీలకం. జాతీయ రహదారులకు మించి 8 లైన్ల వెడల్పుతో ఉండే రేడియల్ రోడ్ల ప్రతిపాదనలతో తమ భూములే లేకుండా పోతాయని మండిపడుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే వికారాబాద్ జిల్లా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేస్తూ ప్రాజెక్టుతో తమ ప్రాంతానికి కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనమే తప్పా.. వ్యవసాయ రంగానికి ఒరిగే ప్రయోజనమే లేదని మండిపడుతున్నారు.