GHMC | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో అశోక్‌రెడ్డి పర్యటించారు. డివిజన్ -3 పరిధిలోని మెహిదీపట్నం ఎంఎస్ డీసీ భవనం వద్ద సీవరేజీ పూడికతీత పనులను పరిశీలించారు.
అలాగే జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ నగరంలోని బండ్లగూడ, హనుమాన్‌నగర్, గోడెకె ఖబర్ సెక్షన్ పరిధిలో సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఈఆర్టీ బృందాలు ఎప్పటికప్పుడు రహదారుల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. తాగు, మురుగునీరు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈడీ సూచించారు.
చుక్క నీరు నిల్వద్దు
చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలతో వర్షం కారణంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం స్వయంగా రంగంలోకి దిగారు. అమీర్‌పేట, షేక్‌పేట, టౌలిచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో పర్యటించారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందితో మాట్లాడారు. వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాలను అధికారులను సమన్వయం చేసుకుంటూ విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.
– సిటీబ్యూరో/మెహిదీపట్నం