ఖైరతాబాద్/ అంబర్‌పేట/ కొండాపూర్ : హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్‌లోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బడా మసీదు వద్ద జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు గజ్జెల ఆనంద్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, షాబీర్, షాషా, రహమాన్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయిక అయినటువంటి పవిత్ర రంజాన్ ప్రార్థనలు అంబర్‌పేట నియోజకవర్గంలో సోమవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట తదితర డివిజన్లలో ఉన్న ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా అందరికీ శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలని, ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అంతా సుఖసంతోషాలతో జీవించాలని నర్సింహారెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో నయీమ్, మోసిన్, యూసుఫ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లోని ఈదుల్ ఫితర్ ఈద్గా దర్గా షరీఫ్ హజరత్ సాలార్ ఏ ఔలియా దర్గా వద్ద రంజాన్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. అలయ్ బలయ్ తీసుకున్నారు.