Operation Kagar | హిమాయత్ నగర్, జూన్ 15 : ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం హిమాయత్ నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, అమాయక గిరిజనులపై క్రూర దాడులు జరిపి భయానక నరమేధాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్నదని, ఈ నరమేధ చర్యలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్యగా సృష్టించి కేంద్రం బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నదని విమర్శిం చారు. ఇటీవల జరిగిన హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
2026 మార్చి నెల వరకు మావోయిస్టులు, ఆ సంస్థలను అంతం చేస్తామంటూ కేంద్రం ప్రకటించడం వెనుక ఆర్ఎస్ఎస్ రహస్య అజెండాను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్నట్లు వారు ధ్వజమెత్తారు. ఇలాంటి భయానక దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమస్యగా పరిగణించి చర్చలతో పరిష్కరించాలన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీలపై దమన కాండను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నెర్లకంటి శ్రీకాంత్, నేతలు వెంకటేశ్వర్లు, నానబాల రామకృష్ణ, బిజ్జ శ్రీనివాసులు, టి. సత్యప్రసాద్, మహేందర్, శ్రీమాన్, కొండల్, రాష్ట్ర ఎల్లంకి మహేష్, ఉపేంద్ర, సల్మాన్ బేగ్, శివ కుమార్, రాజేష్, మహమూద్, మాజీద్, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు.