SCR | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 30 రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట-విజయవాడ సెక్షన్ మధ్యలోని ఖమ్మంలో జరుగుతున్న రైల్వే నిర్వహణ పనులుతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్లను రద్దు చేయాల్సి వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు రైళ్ల రద్దు ఉంటుందని, ఇదే మార్గంలో నడిచే మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపారు.
ముగిసిన సంప్రదింపుల కమిటీ సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 71వ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశం గురువారం ముగిసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, వినియోగదారుల సమస్యలపై చర్చించారు.