Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని మాట్లాడుతున్నా.. మావాడికి ఉద్యోగం ఇవ్వండి… మా వాడికి మంచి పోస్టింగ్ ఇవ్వండి.. అంటూ అధికారులను బురిడీ కొట్టిస్తూ, కోట్ల రూపాయలు దండుకుంటున్న ఒక ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగుల బదిలీలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ ఈ ముఠా నమ్మిస్తూ సుమారు 110 మంది నుంచి రూ. 1.29 కోట్లు వసూలు చేసిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.
శుక్రవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. భువనగిరి మండలం హుస్నాబాద్‌కు చెందిన అనుగు సురేందర్‌రెడ్డి కుషాయిగూడ జెడ్పీహెచ్ఎస్లో మిడ్ డే మిల్స్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. 2023, నవంబర్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అప్పట్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానంటూ నమ్మించి.. అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
ఇందుకు తనకు తెలిసిన కీసరకు చెందిన మెరినా రోజ్, పోచారం నివాసి అంజయ్య, వెంకటేశ్, గోపాల్ నాయక్, హర్షిణి రెడ్డితో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. హర్షిణి రెడ్డి ఆర్డీఓగా నటిస్తూ.. ఫోన్లలో మాట్లాడుతోంది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటూ నమ్మించి.. 98 మంది నుంచి రూ.1.04 కోట్లు వసూలు చేశారు. ఇండ్ల కోసం బాధితులు ప్రశ్నించగా.. ఆర్డీఓగా హర్షిణిరెడ్డి మాట్లాడుతూ.. ఇండ్లు వచ్చేస్తాయంటూ చెప్పారు.
ఎన్నికలు పూర్తయ్యాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రధాన నిందితుడైన సురేందర్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి సలహాదారు అయిన వేం నరేందర్‌రెడ్డిగా అవతారమెత్తాడు. గురుకుల పాఠశాలల అధికారుల వద్దకు ముఠాలో ఒకడైన అంజయ్యను పంపించి.. అక్కడి అధికారులతో ఫోన్లో మాట్లాడాడు. తాను వేం నరేందర్రెడ్డినని, మా వాడికి ఏదైనా ఉద్యోగం చూడండంటూ సూచించాడు. అధికారులు సైతం నిజమని నమ్మారు. అయితే, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉంటాయంటూ ఆయనకు ఫోన్లో చెప్పారు. ఫోన్లో మాట్లాడింది నరేందర్‌రెడ్డి అని నమ్మిన అక్కడి అధికారులు తమకు మంచి పోస్టులు ఇప్పించాలని, ఇందుకు నరేందర్‌రెడ్డిని సహాయం చేయమని అక్కడికి వెళ్లిన అంజయ్యతో మధ్యవర్తిత్వం చేయించారు.
ఫోన్లో మాట్లాడిన సురేందర్.. విద్యాశాఖలోని ఏడుగురు అధికారులను సైతం బదిలీ చేయిస్తానంటూ రూ. 7 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (గురుకుల) వరకు వెళ్లింది. సెక్రటరీతోనూ వేం నరేందర్రెడ్డినంటూ.. సురేందర్‌రెడ్డి మాట్లాడాడు. ఫోన్లో మాట్లాడిన విధానాన్ని బట్టి.. నరేందర్‌రెడ్డి కాదని అధికారులు గుర్తించి.. రాచకొండ పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనూ ఉద్యోగాలిప్పిస్తామంటూ ఇద్దరి వద్ద నుంచి రూ. 18.5 లక్షలు, డబుల్ బెడ్రూం, బదిలీలు, ఉద్యోగాల పేరుతో దాదాపు రూ. 1.29 కోట్లు సురేందర్‌రెడ్డి ముఠా వసూలు చేసింది.
ఈ ముఠాలో ఉన్న ఐదుగురికి వేలల్లో ఇచ్చిన సురేందర్‌రెడ్డి.. మిగతా డబ్బంతా తన సొంతానికే వాడుకున్నాడు. రూ. 1.29 కోట్ల మోసంలో రూ.1.05 కోట్లు సురేందర్‌రెడ్డి వాడుకోగా.. అందులో కోటి రూపాయలు క్రికెట్ బెట్టింగ్ కోసమే వెచ్చించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోనే ఈ కోటి రూపాయలు డిపాజిట్ చేసి.. వాటిని బెట్టింగ్‌ల కోసం సురేందర్ వాడుకున్నాడని సీపీ వెల్లడించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం నకిలీ పట్టాలు తయారు చేశారని, ప్రభుత్వానికి సంబంధించిన రబ్బర్ స్టాంపులు కూడా నకిలీవి తయారు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు ఘట్కేసర్, కీసర ఠాణాల్లో మూడు కేసులు నమోదు కావడంతో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి నేతృత్వంలోని బృందం, కీసర పోలీసులతో కలిసి ఈ ముఠా కోసం గాలించి పట్టుకుందని సీపీ వెల్లడించారు. ఈ ముఠా నుంచి రూ. 1.97 లక్షల నగదు, 98 నకిలీ డబుల్ బెడ్రూం అలాట్మెంట్ పత్రాలు, రెండు నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.