Hyderabad | హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. వెంకట మాధవి హత్య కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సుధీర్ బాబు తెలిపారు. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా..? అని మేం నివ్వెరపోయామని పేర్కొన్నారు. భార్యను అత్యంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని సుధీర్ బాబు చెప్పారు.
సంక్రాంతి పండుగకు గురుమూర్తి తన భార్య వెంకట మాధవి, పిల్లల్ని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇక పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి.. గురుమూర్తి, మాధవి కలిసి 15న రాత్రి 10.41 గంటలకు మీర్‌పేటలోని ఇంటికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించాం. ఇక 16వ తేదీన భార్యతో గురుమూర్తి గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఆమె తలను గోడకేసి కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో గొంతు నులిమి చంపేశాడు. మాధవి శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేశారు. మొదట కాళ్లను నరికేశాడు. అనంతరం చేతులను నరికాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మృతదేహాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసినట్లు గుర్తించాం. శరీర భాగాలను మొదట వాటర్ హీటర్‌తో మరిగించి.. ఉడకబెట్టాడు. ఆ తర్వాత స్టవ్‌పై ఆ ముక్కలను కాల్చాడు. రోకలి బండతో ఆ భాగాలను దంచి పొడి చేశాడు. ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్లలో తీసుకెళ్లి.. జిల్లెలగూడ చెరువులో కలిపాడు. ఇక ఇంట్లో మాధవి ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాత.. బంధువుల ఇంటికి వెళ్లి తన పిల్లలను తీసుకొచ్చాడు అని సీపీ సుధీర్ వెల్లడించారు.
ఇంటికొచ్చిన పిల్లలు.. అమ్మ ఎక్కడ అని అడిగితే.. బయటకు వెళ్లిందని గురుమూర్తి చెప్పాడు. రెండు రోజుల తర్వాత మాధవి పేరెంట్స్ అడిగితే పోలీస్ స్టేషన్‌కు వచ్చి మిస్సింగ్ కేసు పెట్టారు. అలా మాధవి హత్య కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. భార్యను కిరాతకంగా చంపడంపై గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. మాధవి హత్యకు ఉపయోగించిన కత్తి, రోలర్, బకెట్, వాటర్ హీటర్, రూమ్ ఫ్రెషనర్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, సర్ఫ్ ప్యాకెట్, బ్లాక్ కలర్ షర్ట్, మృతురాలి డ్రెస్, స్టవ్, రెండు మొబైల్ ఫోన్లు సహా మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఐటీ కారిడార్‌లో వినూత్న నిసరనలు
Harish Rao | రైతు భరోసా చిల్లర పంచాయితీనా ముఖ్యమంత్రి గారు..? సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
KTR | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నా : కేటీఆర్