Rabies vaccine | హిమాయత్ నగర్, జూలై 6 : పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్ టీకా వేయించాలని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ మహేశ్వరీ అన్నారు. ఆదివారం నారాయణగూడ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్లో సూపరిండెంట్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 500 పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి ఎం.ప్రవీణ్ కుమార్, ఇండియన్ ఇమ్యునాలాజికల్ ప్రతినిధి ఉదయ్ శంకర్, డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడారు.
రేబీస్ వ్యాధి కుక్కలు, పిల్లులు, గబ్బిలాల కరచినప్పుడు వాటి లాలాజలం వల్ల సంక్రమిస్తుందని అన్నారు. ఇవి కరిచినప్పుడు కట్టు కట్టకుండా సబ్బు పెట్టి నల్లా నీళ్లతో శుభ్రంగా కడిగి వైద్యున్ని సంప్రదించి, యాంటి రేబిస్ ఇంజక్షన్, లేదా టీటీ ఇంజక్షన్ వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా.ఎన్.శ్రీనివాస్ రెడ్డి, డా.బి.నవీన్ కుమార్ రెడ్డి, పశు వైద్యధికారులు డా.అరవింద్, డా.చంద్రశేఖర్ రెడ్డి, డా.ప్రవీణ్ కులకర్ణి, డా.సురేష్, డా.రంజిత్, తివారి తదితరులు పాల్గొన్నారు.