రవీంద్రభారతి,డిసెంబర్ 26 ఫీజు బకాయిలు రూ. 5వేల కోట్లు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థులను చదువుకోకుండా కుట్రలు చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బడా కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల బడ్జెట్‌ను కేటాయించి డబ్లు చెల్లిస్తూ కమీషన్లు తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని విమర్శించారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 16 లక్షల 75 వేల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వేలకోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడంలేదని సీఎం రేవంత్‌రెడ్డికి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ఫీజు బకాయిలు చెల్లించడానికి మనసు అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా 12 సార్లు విద్యార్థుల ఫీజుల కోసం ధర్నాలు, రాస్తారోకలు చేసినా ఈ ప్రభుత్వానికి దున్నపోతుమీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బకాయిలు చెల్లించాలని జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న పట్టించుకోవడంలేదని, ఆర్థిక శాఖ మంత్రి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉందని, కానీ విద్యార్థుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన వైఖరిని మార్చుకోకపోతే విద్యార్థుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు పరీక్షలకు రాయడానికి హాల్‌టికెట్లు ఇవ్వడంలేదని, పై చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో బడుగుబలహీన వర్గాల విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేసి రోడ్లపైన తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను ఉపయోగించుకొని ఇప్పుడు గాలికివదిలేశారని, ఇదేనా ప్రజాపాలన అని కృష్ణయ్య ధ్వజమెత్తారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు సంవత్సరానికి రూ. 5,500లు చెల్లిస్తే ఎక్కడ సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 20వేలు పెంచాలని, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్,జల్లపల్లి అంజి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.