R Krishnaiah | ముషీరాబాద్, జూలై 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల, రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవలసిన కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల జీవో తీయకుండా కోర్టు కొట్టి వేస్తుందని ఊహాగానాలతో పెండింగ్‌లో పెట్టారని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చని ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయని భావించినా.. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లినాసరే బీసీలే కేసులు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బీసీలందరూ ఈ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు.