సిటీబ్యూరో/దుండిగల్/మేడ్చల్ మా అమ్మనాన్న రూమ్‌లు వెతకనీకి పోయిండ్రు. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు. బియ్యం తీసుకుంటుంటే వండుకోనీయకుండా ఖాళీచేయమని చెప్పి వెళ్లగొట్టిండ్రు. కనీసం అన్నం కూడా తిననీయలేదు. ఆకలైతుంది. ఇల్లు పోయింది బాధైతుంది. పుస్తకాలు కూడా కూల్చిన ఇంట్లోనే పోయినయ్.. మాకు న్యాయం చేయాలె. మా ఇల్లు మాకియ్యాలె..
మా బుక్స్ అన్నీ బయటపారేసి పోయిండ్రు. పిల్లలని కూడా చూడట్లేదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నయ్.. స్కూల్వాళ్లు ఎగ్జామ్ పేపర్లు కూడా ఇచ్చారు. కానీ అన్నీ అందులోనే పోయాయ్.. మాకు ఏం చేయాలో తోచడం లేదు. మా పరిస్థితి ఏందో మాకే అర్థమైతలేదు. అందినకాడికి పుస్తకాలు తెచ్చుకున్నం. కానీ వాళ్లు బయటకు పంపుతున్నరు. అందరినీ రోడ్డు మీద పడేసిండ్రు.
– ఇది గాజులరామారంలోని బస్తీలో హైడ్రా బాధితులైన చిన్నారుల రోదన..
తెలంగాణలో పెద్ద పండుగ ఇవాళ. మాకు పండుగ లేకుండా చేసింరు. మా శవాల మీద నడుస్తుండు. పండుగరోజు మాకెందుకీ గోస..పెద్దలకు పెట్టుకోకుండా చేసింరు.. ఇదేం ప్రభుత్వం.. ఇదెక్కడి హైడ్రా.. మా బతుకులను కూల్చేసి మా శవాల మీద నడుస్తున్నరంటూ కొందరు మహిళల ఆక్రందనలు..
మమ్మల్ని బతకనివ్వరా.. వాడు బాగుపడతడా.. మేం గరీబోళ్లం. పెద్దోళ్లను వదిలేసి మా జోలికి వస్తడా. హైడ్రా వచ్చింది .. మా ఇండ్లు కూల్చేసింది. చిన్నచిన్న పిల్లలతో రోడ్డునపడ్డం.. వాని ఇంట్లో పీనుగెల్ల.. అంటూ మరికొందరి శాపనార్థాలు అన్నీ కూలగొట్టిండ్రు కదా. బతుకమ్మ రోజు మాకు పండుగెక్కడిది. అసలు పండుగ పండుగలెక్క ఉన్నదా. ఆయనేదో చేస్తడనుకున్నం. కానీ మా బతుకులే కూలగొట్టిండు.రేవంత్‌రెడ్డి పరిపాలనే చండాలం. పెద్దోళ్లకోసం పనిచేస్తడు.. పేదోళ్ల ఇండ్లు కూలగొడ్తడు. ఇదేం ప్రభుత్వమంటూ ఇంకొందరి నిరసనలు..
మహిళలు, స్థానికులు, చిన్నారులు హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో బాలయ్యబస్తీ సర్వే నంబర్ 307, గాలిపోచమ్మ బస్తీ సర్వే నంబర్లు 307,342లలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇండ్లల్లో ఉన్నవారిని ఉన్నట్లే బయటకు పంపించి ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్నవారు కనీసం వంటకూడా వండుకోనీయకుండా బయటకు పంపడంతో పిల్లలు ఆకలితో అలమటించారు.
ఒకవైపు కొద్దిసేపటి క్రితం వరకు తాము ఉంటున్న ఇంట్లో సంతోషంగా పండుగ జరుపుకోవాలని, పెత్రామాస్యరోజున పెద్దలకు పెట్టుకోవడానికి ఉన్నంతలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే ఒక్కసారిగా తమను ఖాళీ చేయాలంటూ పోలీసులు, హైడ్రా సిబ్బంది వచ్చి హడావిడి చేయడంతో స్థానికులు పరేషాన్ అయ్యారు. ఏం చేయాలో పాలుపోక అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. తమకు చిన్నచిన్న పిల్లలు ఉన్నారని , తమను రోడ్డున పడేయొద్దంటూ వేడుకున్నారు.
అయినా అధికారులు కరగలేదు సరికదా వాళ్లను పక్కకు నెట్టేసి బలవంతంగా బయటకు పంపించి ఇళ్లు కూల్చేశారు. పిల్లల పుస్తకాలు, కొంత సామగ్రి గి అక్కడే ఉండిపోయిందని పలువురు చిన్నారులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరీక్షలు ఉన్నాయని, ఎగ్జామ్ పేపర్స్ కూడా తీసుకోనీయకుండా బయటకు పంపించారంటూ అక్కడే ఉన్న చెట్ల కింద గంటల తరబడి ఆకలితో చిన్నారులు అలమటించడం చూసిన ప్రతీ ఒక్కరూ బాధపడినా హైడ్రా సిబ్బంది మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా తమ పనితాము చేసుకుపోయారు. ప్రెస్నోట్లతో హడావిడి చేసే హైడ్రా ఉన్నతాధికారులు కూడా పేదల ఆక్రందనలను పట్టించుకోకుండా తమ గొప్పలు చెప్పుకొనేందుకు తహతహలాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రత్యామ్నాయం చూపించారా ..?
అసలు అక్కడ పేదల ఇండ్లను కూల్చేయాల్సిన అవసరమేంటని, ఇలా చేసేముందు వారికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించారా అంటూ పలువురు ప్రశ్నించారు. దాదాపు 200మంది పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల పర్యవేక్షణలో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు కొనసాగించారు.
శవాల మీద పండుగ..!
శవాల మీద పండుగనా ఇది. మా ఇల్లు కూలగొట్టింరు. పండుగ పండుగ లెక్క ఉన్నదా. మా శవాల మీద పండుగ చేసుకోమంటుండు. కొంతమంది 30 ఏండ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నరు. అసలు హైడ్రా ఏం చేయాలి.. ఏం చేస్తుంది. మా జోలికి వచ్చి మా బతుకులు రోడ్డున పడేస్తే ఇదేం న్యాయం.. హైడ్రా వచ్చి గరీబోళ్ల ఇండ్లను కూలగొట్టింరు. ఐదు వందలకు పనిచేసేటోళ్లం. కూలీపని చేసుకునేటోళ్లం. దొడ్డు బియ్యం తిని బతికేటోళ్లం. పెద్దోళ్లను వదిలి గరీబోళ్ల ఇండ్లపై పడడం న్యాయమేనా.
మమ్మల్ని చంపుతుండు..!
హైడ్రా మీద మన్ను పడ.. మమ్మల్ని చంపుతుండు. గుడిసె వేసుకుని ఉంటే ఉండనిస్తలేడు. మేం కూలీ చేసుకుని బతికేటోళ్లం.. వంట వండుకుని తిందామన్నా కూడా లేకుండా చేసిండు. మాకేమన్న ఆస్తులున్నయంటే మీరే అన్నీ తీసుకుని మాకు గుడిసెలియ్యండి. ఎప్పటికీ మాకు భయమే. ఇప్పుడు ఇల్లు పోయింది. ఇక రోడ్డు బతుకులే మావి. ఓట్లప్పుడు వచ్చిండు.. ఇప్పుడేమో కనబడరు.
పెద్దలకు పెట్టుకోకుండా చేసిండు..!
పెత్రామాస రోజున పెద్దలకు పెట్టుకోకుండా ఇట్లచేసిండు. మమ్మల్నందరినీ ఏడిపిస్తున్నడు. వాడినెందుకు గెలిపించింరో అప్పుడు తెల్వలే. ఇప్పుడు ఊరందరూ ఏడుస్తున్నరు. ఇండ్లు కూల్చేసి రోడ్డు మీద పడేసింరు. పండుగ రోజున మాకు బతుకమ్మ ఎక్కడిది.. పోలీసోళ్లతోని బతుకమ్మ ఆడుతున్నం. లాఠీలు పెట్టి కొడుతుంటే ఆడుతున్నం. వాళ్లకు పవర్ ఇచ్చింది రేవంత్‌రెడ్డి కదా. ఆయననురమ్మను. సైలెంట్‌గా ఇంట్ల ఉన్నడు.
ఆస్తులులేవు.. అంతస్తులు లేవు..
మేం గరీబోళ్లం.. చిన్నచిన్న పిల్లలున్నరు. మేం కూలీనాలి చేసి తాతలకాలం నాటినుంచి మేము క్వారీలలో కంకర కొట్టుకుని బతికినం. ఇంతకుముందు కూడాఇట్లనే చేస్తే రోడ్డుమీద వండుకుని తిన్నం. మేం పొద్దున పోతం. ఐదువందలకు కూలీనాలి చేసి వచ్చి సాయంత్రం మా బతుకులేందో మేం బతుకుతం.. మాకు ఆస్తులులేవు. అంతస్తులు లేవు. చిన్నపిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నం. కానీ హైడ్రా వచ్చి మా బతుకులు నాశనం చేసింది.
అన్నం తినలే..!
మా అమ్మనాన్న రూమ్‌లు వెతకడానికి పోయిండ్రు. అన్నం తినలే. అన్నం వండలేదు. వండుకుందామని బియ్యం తీసుకుంటుంటే వాళ్లొచ్చి ఖాళీ చేయమని చెప్పి బయటకు వెళ్లగొట్టింరు. మధ్యాహ్నం ఐతుంది ఆకలైతుంది. ఇల్లు పోయింది నాకు బాధనిపిస్తుంది. మా అమ్మ వాళ్ల దగ్గర పైసలు లేవు. వాళ్లు అడ్డమీద కూలీకి పోతరు. నా పుస్తకాలు కూడా అందులోనే పోయినయ్..
మాకేం న్యాయం చేస్తడు..!
పండుగే లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు. ఎప్పుడో వచ్చి ఇక్కడ కట్టుకుని ఉంటుంటే మా జోలికి ఎందుకు వస్తున్నరు. ఏం నోటీసులియ్యకుండానే కూల్చేసింరు. ఇదేం పద్ధతి. అందరి ఇండ్లు కూలగొట్టి మమ్మల్నందరినీ బయటకు వెళ్లగొడితే ఎట్ల బతకాలె. రేవంత్‌రెడ్డి మాకేం న్యాయం చేస్తడు. ఓటుకునోటు దొంగే ఆయన.