సిటీబ్యూరో/వెంగళ్రావు నగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా…సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారంటూ మంత్రులకు, మేయర్‌కు ఓ రేంజ్లో నిరసన సెగ తలిగింది. రూ.500కు గ్యాస్ సిలెండర్, ఫ్రీ కరెంట్, రేషన్ కార్డులతో పాటు మహిళలకు రూ.2500లు పంపిణీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని మంత్రులు తుమ్మల, వివేక్ వెంకటస్వామిలను మహిళలు గట్టిగా నిలదీసి ప్రశ్నించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల వారికి సన్నబియ్యం ఇస్తున్నామంటూ మహిళల్ని నచ్చజెప్పడానికి విఫలయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఈ సమయంలోనే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓ దశలో సహనం కోల్పోయి నిలదీసిన మహిళలపై రుసరుసలాడారు. అరవకమ్మా..చెప్పింది వినవమ్మా అంటూ మేయర్ గద్వాలః విజయలక్ష్మి ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు ధీటుగా మహిళలు బదులిచ్చారు.
చాలు..చాల్లేవమ్మా ఇంకేం చెప్పావు..పోవమ్మా అంటూ మహిళలు కన్నెర్ర చేశారు. మహిళల ఆగ్రహజ్వాలలు మిన్నంటడంతో ఇక చేసేదేమీలేక మంత్రులు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మహిళలు నిలదీసి ప్రశ్నించడంతో మంత్రులు బిక్కముఖం వేసుకుని వెళ్లిపోయారు. సోమవారం షేక్‌పేట్ వినాయకనగర్ డివిజన్లో సీసీ రోడ్ల శంకుస్థాపనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకారం, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు, కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, ఖనిజాల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌లకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసపుచ్చుతుందంటూ కాంగ్రెస్ మంత్రుల్ని షేక్‌పేట్‌లో జనం షేక్ చేయడం గమనార్హం.
తెల్లముఖం వేసిన మంత్రులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికల వస్తుండడంతో మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. రహదారులు, నాలాలు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు అంటూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ వస్తున్నారు. 19 నెలలుగా ప్రజల సమస్యలపై పట్టించుకోని ప్రజాప్రతినిధులు… నియోజకవర్గంలో ఎన్నికల ముసుగులో వస్తున్నారంటూ ప్రజలు స్పష్టమైన అవగాహన వచ్చారు.
ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రుల షేక్‌పేట్ లో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్మరించిందంటూ జనం కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల్ని నిగ్గదీసి కడిగిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇద్దరు మంత్రులపై మహిళలు కన్నెర్ర చేశారు. మహిళల్లో పెల్లుబికిన ఆగ్రహంతో నిలదీసి అడగడంతో జనానికి సమాధానం ఇవ్వలేక మంత్రులు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. ఇప్పటికే పలు చోట్ల రేషన్ కార్డులపై నిలదీసిన జనం..తాజాగా సంక్షేమ పథకాలపై నిలదీయడం విశేషం. ప్రజా పాలన పట్ల పౌరుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శమని మేధావుల్లో చర్చ జరుగుతున్నది.
జనాలేరీ?
నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు, మేయర్ పర్యటిస్తున్నప్పుడు..అందులో ప్రభు త్వ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకు జనాలను తరలించకపోవడంపై మంత్రులు వివేక్, తుమ్మల నా గేశ్వర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీర్స్ కాలనీలో 500ల మందికి రేషన్ కార్డు లు ఇచ్చినప్పుడు ఆ కార్డుదారులను సమావేశాలకు తీసుకురాలేరా? అని అసహనం వ్య క్తం చేశారు. మొత్తంగా అటు పౌరుల నుంచి వ్యతిరేకత, పార్టీ లోపాలపై మంత్రులకు దిమ్మ తిరిగే షాక్ తగలడం పట్ల పార్టీలో వి స్తృత చర్చకు దారితీసింది. కాగా, మంత్రులు మూడు వారాల కిందట పర్యటించిన సందర్భంలోనూ అధికారుల నుంచి ప్రొటోకాల్ అంశంలో చేదు అనుభవం మిగలగా తాజాగా జనం నుంచి చుక్కెదురు కావడం గమనార్హం.