కరోనా ప్రభావంతో ఆస్తిపన్ను చెల్లింపులు ఆన్లైన్ బాటపట్టాయి. గతంలో 80కోట్లకు మించని డిజిటల్ చెల్లింపుల విలువ..2020-21 ఆర్థిక సంవత్సరంలో 573.65కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించిన యజమానులతో పోలిస్తే దాదాపు 55శాతం మంది డిజిటల్ చెల్లింపులకు జై కొట్టారు. గురువారం వరకు పన్ను చెల్లించిన యజమానులు 1168939 ఉంటే ..1493.22కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైంది. ఇందులో సిటిజన్ సర్వీస్ సెంటర్స్ నుంచి 185కోట్లు, బిల్ కలెక్టర్లు 734.02 కోట్లు వసూలు చేశారు. ఇక మీ సేవా ద్వారా 72.20, ఆన్లైన్లో 501.45 కోట్లు చెల్లింపులు జరిగాయి. కాగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు జీహెచ్ఎంసీకి చాలా కాలంగా చెక్కులిస్తూ రావడం..వాటిని బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు వసూలు చేసుకొని సర్కిల్ కార్యాలయాల్లో జమ చేస్తారు. ఐతే గతంలో కంటే ఈ ఏడాది చెక్కులు కూడా తగ్గాయని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కొవిడ్ సమయం మొదలుకావడంతో ఈ మార్పు కనిపించిందని అధికారులు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని 90శాతం వరకు మాఫీ చేసే వన్‌టైం సెటిల్మెంట్ పథకం కింద చెల్లించేందుకు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు తమ ఆస్తిపన్ను బకాయిలను చెల్లించి వడ్డీ రాయితీని వినియోగించుకోవాలని సూచించారు.