హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రంగం సిద్ధం చేస్తున్నది. మూడు లక్షల భవనాలను లక్ష్యంగా చేసుకొని రూ.300 కోట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోవడమే తరువాయి నగర ప్రజలపై మరో పిడుగు పడబోతున్నది. రెండేండ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పెడచెవిన పెడుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైనే భారం మోపే నిర్ణయాలు తీసుకోవడంలో అందె వేసిన ‘చెయ్యి’గా నిలిచింది.
ఏటా రూ.1200 ఆస్తిపన్ను చెల్లించే మధ్య తరగతి ప్రజలకు మేలు కలిగేలా రూ.101 రాయితీ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టగా దీని ద్వారా ఐదు లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. కాగా ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ సర్కారు ఈ పథకానికి నీళ్లొదిలి ఇప్పటికే లక్షన్నర భవనాలను రాయితీ నుంచి దూరం చేసింది. మిగిలిన 3.5 లక్షల కుటుంబాలపై భారం మోపేందుకు రెడీ అయ్యింది. ఇది చాలదన్నట్టు గ్రేటర్ వ్యాప్తంగా మరో మూడు లక్షల భవనాలను టార్గెట్‌గా చేసుకుని రూ.300 కోట్లు రాబట్టుకునే మాస్టర్‌ప్లాన్‌కు తెరలేపింది.
అధునాతన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను వినియోగించి పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో డీసీ (డిప్యూటీ కమిషనర్లు) తమ సర్కిళ్ల పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న, చెల్లించని, బకాయిపడిన భవనాలను తనిఖీ చేస్తూ సంబంధిత భవనాల నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ రశీదుల పరిశీలన మొదలు పెట్టారు.
భవనాల తనిఖీ సమయంలో ఏ మేరకు అనుమతులున్నాయి? అక్రమ నిర్మాణామా? నివాసమా? వ్యాపార భవనమా? పాక్షిక వ్యాపార భవనమా? ఇతర లొసుగులు ఏవైనా ఉన్నాయా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పన్నులు విధించడం, సరిచేయడం, అక్రమ నిర్మాణాలైతే జరిమానాలతో కూడిన పన్ను విధించేలా డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి కాగానే రూ.300 కోట్ల రాబడి లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులు పనిచేయనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలున్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్డ్స్ 34 వేల వరకు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3 వేల కోట్ల లక్ష్యంగా ఆస్తిపన్నుల వసూలుపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రస్తుతం ఈ నెల 6 నాటికి రూ.1,415 కోట్లు రాబట్టుకున్నది. మూడు వేల కోట్లకు చేరేలా ఆస్తిపన్నుల్లో అడ్డగోలుగా సవరణలు చేస్తూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నది. జీఐఎస్ అస్ర్తాన్ని తెరపైకి తెచ్చి గ్రేటర్‌లోని ప్రాపర్టీలపై సర్వే చేసింది. బిల్డింగ్ పర్మిషన్, ఆక్యుపెన్సీ, ఆస్తిపన్ను చెల్లించిన లేటెస్ట్ రశీదు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, ట్రేడ్ లైసెన్స్, ఓనర్ వివరాలు సేకరిస్తున్నారు.
మూడు లక్షల భవనాలు, రూ.300 కోట్ల వసూళ్ల లక్ష్యంతో రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటి వరకు రూ.70 వేల భవనాలను గుర్తించారు. వారికి అదనంగా ఆస్తిపన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. మూడు లక్షల భవనాలపై ఈ అదనపు భారాన్ని మోపి బల్దియా ఖజానాను నింపుకొనే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి.. బడ్జెట్ కేటాయింపులు కూడా చేయని సర్కారు ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు. రెండేండ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టని సర్కారు అడ్డగోలుగా పన్నుల భారం మోపడం తగదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అధికార యంత్రాంగం అడ్డదారులు తొక్కుతున్నది. నిబంధనలకు నీళ్లొదిలి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది. బల్దియాకు ప్రధాన ఆదాయవనరైన ఆస్తిపన్నుపై ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే సవరణలు చేస్తున్నది. ఇందుకు విద్యుత్తుశాఖ బిల్లులు, సబ్ రిజిస్ట్రార్లను పావుగా వాడుకుంటున్నది. కొత్తగా కొనుగోలు చేస్తున్న ఖాళీ స్థలం నుంచి ఇండ్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఆస్తిపన్ను సైతం అసెస్మెంట్ చేస్తున్నారు. రిజిస్ట్రార్.. స్టాండింగ్ కమిటీ నుంచి ఎలాంటి తీర్మానం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆస్తిపన్ను పెంచేశారు. ఒక మాటలో చెప్పాలంటే బల్దియా అప్రకటిత ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని అమలు చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.