అబిడ్స్, జూన్ 2: నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్నారు.
దీంతో అటు రేషన్ డీలర్లు, ఇటు రేషన్ లబ్ధిదారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికంతటికీ కారణం కొత్త సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడమేనని తెలుస్తున్నది. వర్షాకాలం నేపథ్యంలో ఆహార భద్రత కార్డులకు జూన్ మాసంలో మూడు నెలల సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం, గతంలో ఉన్న సాఫ్ట్ వేర్ మార్చడంతో సరుకులు పొందేందుకు ఆహార భద్రత కార్డు దారులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో నగరంలోని రేషన్ దుకాణాల ముందు ఆహార భద్రత కార్డుదారులు గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేసే విధానంలో మొదటి రోజు కార్డు దారులు, రేషన్ డీలర్లు నానా ఇబ్బందులు పడ్డారు. రెండో రోజు కూడా నగరంలో అదే పరిస్థితి నెలకొంది. ఒక్కో ఆహార భద్రత కార్డులో ప్రతి సభ్యునికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించే కిలో బియ్యం వేరు వేరుగా తూకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు సరఫరా చేసేందుకు ఈ పాస్ యంత్రాలను వినియోగిస్తున్నారు. అయితే గతంలో ఉన్న సాఫ్ట్వేర్ ను కొనసాగించకుండా అధికారులు జూన్ మాసం నుంచి నూతన సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. 3 నెలల రేషన్ సరుకులను పంపిణీ చేయాల్సిన జూన్ మాసంలోనే నూతన సాఫ్ట్వేర్ ను తీసుకురావడంతో అనేక ఇబ్బందులు తప్పడం లేదని ఆహార భద్రత కార్డు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సర్వర్ తరచూ మొరాయించడంతో ఒక్క ఎంట్రీ కి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం తీసుకోవడం కార్డుదారులను రేషన్ డీలర్లను విసిగెత్తిస్తున్నది.
జూన్ మాసంలో పాత సాఫ్ట్ వేర్ ను కొనసాగించి జూలై మాసం నుంచి నూతన సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకువస్తే బాగుండేదని డీలర్లు, ఆహార భద్రత కార్డుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న సాఫ్ట్ వేర్ లో కార్డులోని ప్రతి సభ్యునికి లభించే 6 కిలోల చొప్పున మొత్తం బియ్యం ఒకే ఎంట్రీలో కనిపించేది. నూతన సాఫ్ట్‌వేర్‌లో 6 కేజీల బియ్యం లో కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యం ఒక దఫా రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం మరో దఫా తూకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక కార్డుదారునికి అందించాల్సిన సరుకులను మూడుసార్లు వేలిముద్రలు వేయించుకొని రెండు సార్లు తూకం చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని, దీంతోనే సమయం అధికంగా పడుతుందని ప్రజలు వాపోతున్నారు. దీనికి తోడు గతంలో గోడౌన్ల నుంచి సరఫరా అయిన స్టాకులు ఈపాస్ మిషన్ లో ఆటోమేటిక్ గా కనిపించేది కానీ ఈ నూతన సాఫ్ట్ వేర్ విధానం వలన డీలర్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల గత సాఫ్ట్ వేర్ ద్వారానే సరుకుల పంపిణీకి అవకాశం ఇవ్వాలని డీలర్లు ఆహార భద్రత కార్డుదారులు కోరుతున్నారు.