‘అది నగరంలోని సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల. అందులో వేసవి సెలవులు ప్రారంభం కాకముందే అడ్మిషన్ల క్రతువు ముగిసింది. ఎల్కేజీకి ఏడాది రూ. లక్ష, డొనేషన్ 1-2 లక్షలు. ఖాళీలను బట్టి డిమాండ్. ఇంతటితో ముగియలేదు.. పుస్తకాలను సైతం వేల రూపాయలు నిర్ణయించి విక్రయించేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఏడాది ముగిసే వరకు ఖర్చులన్నీ కలిపి మరో లక్షన్నర వరకు ఉంటాయని రజిత అనే పేరెంట్ తెలిపారు.’
‘స్కూళ్ల ఫీజులపై నియంత్రణ లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. యాజమాన్యాలను ప్రశ్నిస్తే చదివితే చదివించండి లేకపోతే అడ్మిషన్ రద్దు చేసుకోండి. ఎవరికీ చెప్పుకున్నా.. తమను ఏమీ చేయలేరు. మా రూల్స్ ఇంతే ఉంటాయి. మా స్కూల్‌కు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.’ అని బెదిరిస్తున్నారని మరో పేరెంట్ ప్రవళిక ఆవేదన వ్యక్తం చేశారు’.
సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ) : విద్యను వ్యాపారంగా మలిచి.. తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేసి.. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి.. తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చేస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలు పుట్టుకొస్తూ.. ఆర్భాట ప్రచారాలతో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు కరువయ్యాయి. ఒక్క బిడ్డ చదువుకోవాలంటే ఎల్కేజీ మొదలు.. పదో తరగతి వరకు డొనేషన్లు, స్కూల్ ఫీజులు, పుస్తకాలు, నోట్‌బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజులు ఇతర ఖర్చులతో మోత మోగుతున్నదని విద్యా వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిందంటే వాటి లాభాల దూరదృష్టి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
నగరంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 2వేలకు పైగా ఉన్నాయి. వీటిలో విద్యా వ్యాపారం అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట ఫీజుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా పర్యవేక్షణ గానీ, నియంత్రణ గానీ మచ్చుకైనా కనిపించడం లేదు. నాణ్యమైన విద్యాబోధన, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నమ్మబలుకుతూ గత ఏడాది కంటే యాభై నుంచి నూరు శాతం వరకు ఎక్కువగా ఫీజులను వసూలు చేసే ప్రణాళికలను యాజామాన్యాలు అమలు చేస్తున్నాయి. అయితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజుల వ్యవహారమంతా ఆయా స్కూళ్ల గవర్నింగ్ బాడీ చూసుకుంటుందని సమాధానమిస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్ల పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1 జారీ చేసింది. కానీ ఈ జీఓను అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఇందులోని 12వ నిబంధన ప్రకారం ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ తమ వార్షికాదాయ వ్యయాలను ఆడిట్ చేయించాలి. అనంతరం ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా అలా చేయడం లేదు. అంతేకాదు మొత్తం వార్షికాదాయంలో స్కూల్ సిబ్బంది జీతాలు, ఫర్నీచర్, అభివృద్ధి ఖర్చు పోగా, మిగిలిన దానిలో కేవలం 5 శాతాన్నే లాభంగా తీసుకోవాలి. కానీ వాస్తవానికి ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన పేరిట భారీగా ఖర్చు చూపిస్తుంటారని విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి స్కూల్లోనూ యాజమాన్య ప్రతినిధులు, టీచర్లు, తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ విద్యార్థుల ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఏటా ఫీజుల వివరాలు, అయిన ఖర్చుతో పాటు వార్షిక అకడమిక్ నివేదికను తయారు చేయించి అధికారుల ముందుంచాలి. దీనిని వారు ఆమోదించాలి. అయితే స్కూల్ పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క పాఠశాల కూడా వార్షిక అకడమిక్ నివేదికను తయారు చేయించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చూసీచూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. జీవో నెంబర్ 1ను పక్కాగా అమలు చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 2007లో జీఓ నంబర్ 2ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫీజులపై చర్చించి ఖరారు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అది కూడా ఇప్పుడు కనుమరుగైంది. జీవో 88 ప్రకారం 250 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క స్కూలు కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకు గదుల్లో, చుట్టూ వాహనం తిరిగే స్థలం లేని భవనాల్లో స్కూళ్లను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు.
ఇష్టానుసారంగా పెంచుతున్న ఫీజులతో తల్లిదండ్రులపై విపరీతమైన భారం పడుతోంది. ఫీజులపై ఎవరికీ ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలో కూడా పేరెంట్స్‌కు తెలియడం లేదు. ఏ స్కూళ్లలో కూడా లాటరీ సిస్టం పెట్టడం లేదు. ఇంతమంది పేదలకు నిబంధనల ప్రకారం ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చామని ప్రకటించడం లేదు. కనీసం నోటీసు బోర్డు కూడా పెట్టడం లేదు. ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయకపోతే విద్య అనేది అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి నిబంధనలు పాటించని స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను రెండున్నర ఏండ్ల నుంచే స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇది సరైనది కాదు. స్కూల్, ట్యూషన్ల పేరుతో చదవమంటూ ఒత్తిడి తీసుకురావడం వల్ల పిల్లలు మానసికంగా కుమిలిపోతారు. డబ్బులు చెల్లించాం కదా అని పిల్లలపై పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో చాలా స్కూళ్లు చిన్న చిన్న గదుల్లో, వెంటిలేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. చిన్నారులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.