సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే యాజమాని మార్పిడి (ఓనర్ షిప్) జరిగిన సందర్భంలో పాత కాంట్రాక్టర్లు రద్దు చేసి ప్రభుత్వం కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే అప్పటి వరకు మెట్రో పిల్లర్లు, స్టేషన్ల వద్ద ప్రదర్శించే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే రెండు ప్రముఖ యాడ్ ఏజెన్సీల కాంట్రాక్ట్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచి అర్హులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ సర్కార్ తిరిగి సంబంధిత ఏజెన్సీలకే ప్రకటనలు కట్టబెట్టడం, టెండర్ల వైపు ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అన్నింటి కంటే మించి ప్రస్తుత రెండు బడా ఏజెన్సీలు జీహెచ్ఎంసీకి (అడ్వరె్టైజ్ మెంట్ ఫీజు/ పన్నులు ) 100 కోట్లకు పైగా బకాయిలు పడింది. ఒక ఏజెన్సీ రూ. 15 కోట్లకు పైగా, మరో ఏజెన్సీ ఏకంగా రూ.90 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ రెండు ఏజెన్సీల నుంచి బకాయిలు వసూలు చేయకపోగా..తిరిగి వారినే కొనసాగిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెడితే, వెంటనే ఆ కాంట్రాక్టును రద్దు చేసి, సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. బ్యాంక్ గ్యారెంటీలను జప్తు చేసి, లీగల్ నోటీసులు ఇచ్చి నిధులు రికవరీ చేయాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ సంస్థపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ‘ముఖ్య’నేత సోదరుడు టార్గెట్‌గా భాగస్వామ్యంతో ఎలాంటి టెండర్లు లేకుండానే మెట్రో ఫిల్లర్ల సాక్షిగా ఆక్రమార్జనకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతున్నది.