అల్లాపూర్, అక్టోబర్29: జ్లూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునితకు మద్దతుగా .. భద్రాచలం నుంచి సైకిల్‌పై వచ్చిన తూతిక ప్రకాష్ వినూత్నంగా బోరబండలో ఎన్నికల ప్రచారం చేశాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న అభిమాన్ని చాటుకుంటున్నాడు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత హామీల ఎగవేత పై ఫ్లెక్సీ ముద్రించి సైకిల్‌కు కట్టుకుని, వీధివీధికి వెళ్లి మాగంటి సునితను గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు. సైకిల్ పై భద్రాచలం నుంచి జూబ్లీహిల్స్‌కు రావడానికి ఆరురోజులు పట్టిందన్నాడు.
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తన సొంత ఖర్చుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటానని తెలిపాడు. వృత్తి రీత్యా తాను రైతునని, దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక వ్యవసాయం చేయలేక అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తం చేశాడు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని గుర్తుచేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నాని చెప్పాడు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఫ్లూటు వాయిస్తూ ..వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రకాష్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.