కుత్బుల్లాపూర్, మే5: లక్ష్యం ఒకటి.. కానీ ఆచరణ మాత్రం మరోలా మారుతుంది. పేరుకే ప్రతి సోమవారం అధికార కార్యాలయాలు ప్రజావాణి (Prajavani) కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజావాణిలో వెలువడిన సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా మరి కొన్ని కార్యాలయాల్లో అసలు ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉంటుందా అని కూడా తెలియని పరిస్థితి కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో వెలుగు చూస్తుంది. దాదాపుగా గత నెల రోజుల నుంచి ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో కేవలం ఒక్కటి అంటే ఒకటి మాత్రమే ఫిర్యాదు వస్తుంది.. అంతకుమించి ఫిర్యాదులు రావడం లేదంటూ అధికారులు బోసిపోయి కూర్చుంటున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రజావాణి కార్యక్రమానికి కార్యాలయం ఉన్నతాధికారి తో పాటు ఆయా విభాగాల అధికారులు ఒకే చోట ఉంటూ వచ్చిన సమస్యలపై తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రజావాణిలో ఉంది. కానీ అలాంటి వాటికి అధికారులు తావు ఇవ్వకుండా కేవలం మొక్కుబడిగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలకు తావిస్తుంది.
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వారి దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పరిష్కరించింది ప్రతి సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించడంలో కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 18 వార్డులు, దీనికి తోడు ఇండస్ట్రియల్ ఏరియా నిత్యం ప్రజలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకున్న పరిస్థితి లేదని వాపోతున్నారు. నేరుగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన బుట్ట దాఖలు మాత్రమే అవుతున్నాయని వాపోతున్నారు.
ఫోన్ చేసినా స్పందన కరువు…
కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న కమిషనర్ కు ప్రభుత్వం అధికారికంగా ఫోన్ నెంబర్ ను కేటాయించింది. అయితే ప్రజలు కార్యాలయం ముందు కమిషనర్ నెంబర్ తీసుకొని తమ సమస్యలను ఫోన్ ద్వారానైనా ఫిర్యాదు చేద్దామంటే ఏనాడు ఫోన్ ఎత్తిన పరిస్థితి ఉండదని, ఒక హోదా లో ఉన్నటువంటి అధికారి కూడా ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకోలేని పరిస్థితి కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నెలకొందని ప్రజలు వాపోతున్నారు.