మొయినాబాద్, జూలై 12 : ప్రజా ప్రభుత్వం అంటే పేదల ఇండ్ల స్థలాలకు సంబంధించిన భూములను బలవంతంగా గుంజుకునే కుట్రలు చేయడమా? అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సర్కారుకు దమ్ముంటే ప్రభుత్వ స్థలాల్లో వెలసిన విద్యాసంస్థలు, ఫామ్‌హౌస్‌లను గుంజుకోవాలని సవాల్ విసిరారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 151లో గత ప్రభుత్వం 2007లో 290 మందికి ఇండ్ల పట్టాలను పంపి ణీ చేయగా.. ఇప్పటికీ ఆ స్థలాలను కేటాయించకపోగా.. ఆ స్థలాన్ని మార్కెట్ యార్డుకు కేటాయించారని వస్తున్న కథనాల నేపథ్యంలో దాని ని వ్యతిరేకిస్తూ గ్రామానికి చెందిన నాలుగు యువజన సంఘాల సభ్యులు గత 17 రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు.
వారికి మాజీ మంత్రి ఆదివారం సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. 2007 లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్ సమీపంలో ఉన్న మండలాల పేదలకు ఇండ్ల స్థలాలకోసం ప్రతి గ్రామంలో 10 ఎకరాలు ఇంటి స్థలాల కోసం జీవో తీసుకొచ్చారన్నారు. అందులో భాగంగానే హిమాయత్‌నగర్ గ్రామంలోని 290 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారని చెప్పారు. పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల భూమి మీద కోర్టు కేసులు ఉన్నాయని, పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించడంలో జాప్యం జరిగిందన్న విషయం వాస్తవమని పేర్కొన్నారు. పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల భూములను మార్కెట్ యార్డు పేరుతో గుంజు కోవడం ప్రజా ప్రభుత్వామా అని ప్రశ్నించారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లి అందులో విద్యా సంస్థలు, ఫామ్ హౌస్‌లు వెలిశాయని ప్రభుత్వానికి దమ్ముంటే ఆ భూములను తీసుకోవాలని సవాల్ విసిరారు.
వైఎస్ఆర్ హయాం లో 290 మందికి పట్టాలు ఇచ్చామని కాని ఇప్పుడు ఆరు వందల మందికి చేరారని, అందరికి 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పేదల భూముల వైపు కన్నెత్తి కూడ చూడలేదని, కాని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం మొయినాబాద్‌లో వందల ఎకరాల భూములను తీసుకుందని తెలిపారు. రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా మూడు వేల ఎకరాల పేదల భూములను గుంజుకుందని ఆరోపించారు. ఇండ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని, అదే విధంగా జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్ సి నారాయణరెడ్డితో మాట్లాడుతానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం స్పందిం చకపోతే రెండెండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఇండ్ల స్థలాలను కేటాయి స్తామని హామీ ఇచ్చారు. ఐక్యంగా ఉండి పట్టువదలకుండా ఆందోళనలు చేయాలని, తమ వెంట కేసీఆర్ సైన్యం ఉంటుందని చెప్పారు.
పచ్చదనం, పరిశుభ్రతలో రాష్ర్టానికి బీఆర్ఎస్ హయాం లో అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు.గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏ గ్రామం చెత్త అదే గ్రామంలో పోసే విధంగా డంపింగ్ యార్డులు, వర్మికంపోస్టు ఫిట్స్ ఏర్పాటు చేసి స్వచ్ఛ తెలంగాణగా మార్చారని తెలిపారు. హైదరబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన భూమిలో హిమాయత్‌నగర్ గ్రామానికి సంబంధించిన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల్లో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు తూడ్చేయడానికే సీఎం రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. క్రీడా ప్రాంగణంలో మొయినాబాద్ మున్సిపాలిటి చెత్త అంతా వేసుర్తన్నారని గండిపేట జలాశయా నికి అతీ సమీపంలో డంపింగ్ యార్డు ఉండటంతో జలాశయం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జే స్వప్నసతీష్కుమార్, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి దేశమొల్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, విజయఆర్య, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మంజూల రవియాదవ్, శ్రీమరియాదవ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవియాదవ్, మాజీ ఉపసర్పంచ్ షాబాద్ శ్యాంరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డపు రాజు, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, కౌన్సిలర్ శ్రీధర్, సీనియర్ నాయకులు కుమ్మరి రాము, జి దర్శన్, ప్రభాకర్‌రెడ్డి, మాల స్వామి,పాటి ప్రసాద్‌రెడ్డి, మల్లేష్‌యాదవ్, బ్యాగరి రాజు, ఎండీ అలీం, రాంరెడ్డి, దర్శన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.