సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వీచిన గాలులు, కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిటీ పరిధిలోని దాదాపు 340కి పైగా 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇందులో ఎక్కువగా బంజారాహిల్స్లో 75, సైబర్సిటీలో 74, మేడ్చల్లో 64 ఫీడర్లు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా కరెంట్ సరఫరా ఆగిపోవడంతో నగరవాసులు కాల్సెంటర్లకు ఫోన్ చేశారు. పెద్దగా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1920కి ఫోన్ చేసినా ఫలితం లేదని, సంస్థ ఇచ్చిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లకు చేస్తే వాళ్లు స్విచాఫ్ చేసుకున్నారంటూ ఉన్నతాధికారులకు చెప్పారు.
గ్రేటర్లో ఈదురుగాలులు, వర్షానికి చాలాచోట్ల పోల్స్ పడిపోయాయి. డీటీఆర్లు అక్కరకురాకుండాపోయాయి. లైన్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. ఈ మొత్తం నష్టాన్ని ప్రాథమికంగా రూ.3కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, సిటీలో 52 పోల్స్ పడిపోయాయని, ఇందులో కొన్ని చోట్ల పోల్స్ మార్చేశామని, మరికొన్ని రిపేర్ చేసి వాటినే వాడామని చెప్పారు. ఇక 20వరకు డీటీఆర్లు దెబ్బతిన్నాయని, వీటి బదులు వేరేవాటిని తెచ్చిపెట్టినట్లు తెలిపారు. సుమారుగా 340కిపైగా 11 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో వాటిని పునరుద్ధరిస్తున్నారు.
నగరంలో కరెంట్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి నుంచి క్షేత్రస్థాయి లైన్మెన్ వరకు సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏఈలు అందరూ క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పాల్గొన్నారు.