Hyderabad | చార్మినార్, మే 3 : చిరు వ్యాపారుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఔన్నత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తుంది. కొన్ని వర్గాల వారితోపాటు నాయి బ్రాహ్మణులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేసింది. ఎన్నికల అనంతరం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నాయీబ్రహ్మణులపై భారం మోపుతూ కరెంట్ చార్జీల వసూళ్లను ప్రారంభించింది. గత 6 నెలలుగా కరెంట్ బిల్లులు జారీ చేస్తూ, పెండింగ్ బకాయిలను చెల్లించాలని హుకుం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయీ బ్రాహ్మణులకు నెలలో వంద విద్యుత్ యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించారు. ఆపై అదనపు యూనిట్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు విద్యుత్ శాఖ సిబ్బంది సెలూన్ షాపులకు ఆ నియమాలను వర్తింపజేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వంద యూనిట్ల ఉచితంపై ప్రభుత్వ ఆదేశాలు ఇంకా మాకు అందలేదు. ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే అంటూ విద్యుత్ సిబ్బంది గత ఆరు నెలలుగా బిల్లులు వసూళ్లు చేస్తున్నారు.
బిల్లులు చెల్లించాలని ముందస్తు సమాచారం మాకు ఏమి అందలేదని కాలికబర్ ప్రాంతానికి చెందిన అనిల్ తెలిపారు. పాతనగరంలో సుమారు 1000కి పైగా చిన్న పెద్ద సెలూన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్ధిక భారం పెరగనుంది. బలహీన వర్గాల వారికి ఆర్ధిక తోడ్పాటు అందించాల్సిన ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో నష్టాలను కలగజేస్తుందని అనిల్ అభిప్రాయపడ్డారు.