సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత్యు కుహరాలుగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కంకర తేలి ఎత్తు పల్లాలుగా మారాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు చేసేవారు. పూర్తిగా దెబ్బతిన్న రహదారులపై కొత్త రోడ్లను నిర్మించేవారు. కానీ ఇప్పుడు 20,591వేలకు పైగా పాట్‌హోల్స్ ఏర్పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినా ఇప్పటివరకు వాటిని పూడ్చకపోవడం శోచనీయం. రోడ్లపై జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌కు నిత్యం వందలాది ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్ల బీటీ, 6,167 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70 శాతం రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరంలో రూ.1041.91 కోట్లతో 3806 రహదారుల పనులు చేపట్టగా, రూ.485 కోట్ల నిధులు ఖర్చు చేసి 1680 చోట్ల పనులు పూర్తి చేశారు. 2,126 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలమయంగానే ఉండటం గమనార్హం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, సీసీ రోడ్డు అయితే 10 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండాలి. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే పూర్తిగా గుంతల మయంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతుండటంతోనే రోడ్లు త్వరగా ధ్వంసమవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు.
నగరంలో సింహభాగం మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలు ద్విచక్రవాహనాలపైనే ప్రయాణిస్తుంటారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీహిల్స్, నానల్‌నగర్, మెహిదీపట్నం, షేక్‌పేట, ప్యారడైజ్, రాంగోపాల్‌పేట, మూసారాంబాగ్, బాలానగర్, ఎర్రగడ్డ, బహదూర్‌పురా, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా ధ్వంసమయ్యాయి. నారాయణగూడ నుంచి రామంతాపూర్‌కు వెళ్లే ప్రయాణికులు అరగంట పాటు నరకం చూస్తున్నారు. అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తా నుంచి ముఖ్రం హోటల్ వరకు మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. పంజాగుట్ట సాయిబాబా కాలనీ, డీడీ కాలనీ, నల్లకుంట కూడలి, జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

గుంతలు ఎందుకు పూడ్చరు..షకీల్, పాతబస్తీ నేను ప్రైవేటు జాబ్ చేస్తాను. నాలుగు రోజుల కింద మాసబ్‌ట్యాంక్ నుంచి బైక్‌పై మెహిదీపట్నం వైపు వెళ్తున్న. ఎన్ఎండీసీ దాటి తర్వాత ఎదురైన గుంతను తప్పించబోయేసరికి వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో కిందపడగా గాయాలయ్యాయి. హెల్మేట్ ఉండటం వల్ల బతికిపోయాను. పాదంపై, మోకాలి వద్ద వాపు వచ్చింది. ఉస్మానియాకు వెళ్తే సిమెంట్ పట్టి వేశారు. కనీసం నెల రోజులు పడ్తదని డాక్టర్లు చెప్పారు. అమీర్‌పేటలో ఏఐ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటున్నాను. అటు జాబు చేయలేక, ఇటు ఏఐ కోర్సు నేర్చుకోలేక ఇలాంటి పరిస్థితి దాపురించింది. రోడ్ల మధ్యలో ఉన్న గుంతలను ఎందుకు పూడ్చరు? పన్నులైతే వసూలు చేస్తారు. ప్రతి చిన్న తప్పుకు మాకు చలానాలు వేస్తరు. మరి ఇప్పుడు మేము ఎవరికి ఫైన్ వేయాలి?
నెల రోజులుగా మంచానికే పరిమితం… అచ్చయ్య, మహబూబ్‌నగర్ జిల్లా బతుకుదెరువు కోసం 10 ఏళ్ల క్రితం భార్యా పిల్లలతో పట్నం వచ్చిన. మంగళ్‌హాట్‌లో కిరాయికి ఉంటున్నం. నాకు ఒక కొడుకు, ఓ కూతురు. ఉస్మాన్‌గంజ్‌లో హమాలీగా పనిచేస్తున్నాను. దసరా పండుగకు రెండు రోజుల ముందు నేను, నాభార్య బండిమీద గంజ్‌కు పోతున్నం. చుడీబజార్ దగ్గర బండి కింద కంకర్రాయి వచ్చి అమాంతం కింద పడ్డం. ఎన్క నుంచి వచ్చిన డీసీఎం డ్రైవర్ సడెన్ బ్రేక్ కొట్టిండు. మా ఆమెకు చెయ్యి విరిగింది. నాకు కాలు విరిగింది. ఉస్మానియాలో షెరీకైనం. పిల్లలొకదిక్కు, మేమొక్కదిక్కు ఆగామాగం అయినం. మా ఇంటి ఓనర్ వాళ్లే వారం పదిరోజులు మా పిల్లలను చూసిండ్రు. మొన్నటిదాక పిల్లలు బడికి పోలేదు. ఎంత అయినోళ్లయినా ఎన్ని రోజులు పెడ్తరు. ఇప్పటికే లక్ష రూపాలు అప్పైంది. ఇంక నెల రోజులు పనిచేయొద్దన్నరు.
ఎట్ల గడుస్తదో ఏమో.

నేను ప్రైవేటు ఉద్యోగిని. భార్యా పిల్లలతో నగరంలో నివాసం ఉంటున్న. ఉద్యోగరీత్యా 15 రోజుల క్రితం బైక్‌పై వస్తూ బంజారాహిల్స్‌లో రోడ్డుపై సడన్‌గా గుంత రావడంతో బైక్ అందులో దిగబడి కిందపడిపోయిన. కాలు ఫ్యాక్చర్ అయ్యింది. కోలుకునేందుకు దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. సర్జరీకి రూ. మూడు లక్షలకు పైగా ఖర్చయ్యాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం.