సిటీ బ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వరదలకు రహదారులు కోతలకు గురై గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉన్న గుంతలు మరింత పెద్దవై వాహనాలు వెళ్లలేని దుస్థితి తెలెత్తుతున్నది. గ్రేటర్ హైదారాబాద్‌లోని ప్రధాన కాలనీలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లలో పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరుకున్నది.
ఎక్కడపడితే అక్కడ ఏర్పడిన గుంతల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. నగరం నలుమూలలా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతల్లో ప్రయాణించడం వల్ల ఒళ్లు హూనమవుతున్నదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు సైతం తొందరగా రిపేరుకు గురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ సిటీ ప్రాంతాల్లోని రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని ఐటీ ఉద్యోగులు చెబుతున్నా రు. కార్యాలయాలకు గతంలో కంటే 30 నిమిషాల నుంచి గంట ముందుగానే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఇక పాత బస్తీ పరిసరాల్లోనైతే పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ ఇరుకుగానే ఉంటాయి. వాటిల్లోనూ గుంతలమయంగా మారితే ప్రయాణ ప్రయాసగా మారుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జీహెచ్ఎంసీ రోడ్లను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడ్డాయో గుర్తించి మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా నాలాలు, మ్యాన్‌హోళ్లలో సమస్యలు తలెత్తితే మరమ్మతులు చేయడానికే రోజుల తరబడి సమయం పడుతున్నది. ప్రజలు ఫిర్యాదులు చేసినా రోజుల తరబడిగా మరమ్మతులకు నోచుకోవడంలేదు. మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో రోడ్లను తవ్వి అలాగే వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రోడ్లు ఛిద్రమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాలాలు, మ్యాన్‌హోళ్లను తవ్వి రోజుల తరబడి అలాగే ఉంచుతున్నారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో రోడ్డు ఆక్రమణకు గురై ఇరుకుగా మారుతున్నది. దీంతో ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. మరమ్మతులు వెంటనే చేస్తే వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నగర ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల, నాలాలు, మ్యాన్‌హోళ్లను మరమ్మతులు చేసి వాటిలోంచి తీసిన బురద, మట్టిని తొలగించకపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్లగానే అంతరాయం ఏర్పడుతున్నది.
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ ఎక్కడో ఒకచోట గుంతలు పడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. వర్షం పడినప్పుడు వాటిలో నీరు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో గుంతల్లో వేగంగా వెళ్లడం వల్ల నడుముల నొప్పులు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. కొన్నిసార్లు ద్విచక్రవాహనాలు, ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నాయి.
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారుతున్నది. గుంతుల్లో వాహనాలు నడిపేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. ఏండ్ల తరబడి ఉంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. గుంతలను పూడ్చడం ద్వారా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలు తగ్గడంతో ఇప్పుడే మరమ్మతులు చేపడితే మరోసారి భారీ వర్షాలు వచ్చిన ఇబ్బందులుడవని చెప్తున్నారు. ఇకనైనా బల్దియా అధికారులు కండ్లు తెరవాలని కోరుతున్నారు.