కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 22: కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్ కోరారు. మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కూకట్పల్లి నియోజకవర్గంలో 9 చెరువులు, రెండు కుంటలను అభివృద్ధి చేయాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో చెరువు సుందరీకరణ పనులను చేపట్టామని, మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరారు. రంగనాథుని (ఐడీయల్) చెరువు, బోయిన చెరువు, ముళ్లకత్వ చెరువు, నల్లచెరువులలో కొంత భాగం సుందరీకరణ పనులు చేశామని, వాటిపై కోర్టు కేసుల దృష్ట్యా ఆ పనులను పూర్తి చేయలేకపోయామని తెలిపారు. న్యాయస్థానంలో కేసులను పరిశీలించి మిగిలిన సుందరీకరణ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న భూయజమానులు/ కొనుగోలు చేసిన వారు ఎవరైనా ఉంటే వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. చెరువులను అభివృద్ధి చేసే క్రమంలో నల్లచెరువు ఐడీయల్ లాంటి చెరువులలో మురుగునీరు చేరకుండా నాలా డైవర్షన్ చేయాలని, ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు. చెరువులను కబ్జా చేసిన వారిపై పార్టీలకతీతంగా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధిలో మాత్రం జాప్యం జరగకుండా చూడాలని కోరారు.
దీనికి హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భూయజమానులు, కొనుగోలుదారుల వివరాలను సేకరించి.. టీడీఆర్ ఇప్పించేందుకు చర్యలు చేపడుతారని, చెరువుల అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే అమృత్ నగర్ తండాలో ముంపు సమస్య బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరారు.
వర్షాకాలంలో ఆ ప్రాంతంలో డ్రైనేజీ నీరు ఇండ్లలోకి చేరుతుందని, ముంపు బాధితులుగా ఆ ప్రాంతంలో 70 కుటుంబాలను గుర్తించి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించే పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ముంపు బాధితులకు కైతలాపూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరారు. ఈ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటారని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.