ఒకప్పుడు లేక్‌సిటీగా పేరొందిన భాగ్యనగర ఖ్యాతి.. ‘కబ్జాల’ కాలగర్భంలో కలిసిపోతున్నది. గడిచిన 44 ఏండ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎస్ఆర్ఎస్సీ) నివేదిక వెల్లడించింది. మహానగరంలో 60 శాతానికి పైగా తటాకాలు అన్యాక్రాంతమయ్యాయని తేల్చింది. కంటి ముందే కనుమరుగైపోతున్న జలవనరులను పరిరక్షించుకోకపోతే.. భవిష్యత్‌లో హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనున్నది.
Hyderabad | సిటీబ్యూరో: లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు లేకుండా పోతున్నాయి. యథేచ్ఛగా పెరుగుతున్న జనారణ్యంలో భావితరాలకు చెరువులంటే ఎలా ఉంటాయో తెలుసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా మహానగరంలో అన్యాక్రాంతమైన చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎస్ఆర్ఎస్సీ) నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో 44 ఏండ్లలో చాలా తటాకాలు కనుమరుగైనట్లు తేల్చింది.
మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న చెరువుల వాస్తవ, ప్రస్తుతం ఉన్న విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని శాటిలైట్ డేటా ద్వారా సేకరించింది. మహానగరంలో 60 శాతానికి పైగా చెరువులు కబ్జాకు గురైనట్లు తేల్చింది.వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం స్పష్టం చేశారు. జలవనరులను పరిరక్షించుకోకపోతే… భవిష్యత్‌లో హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనున్నది.
ఎవరినీ వదిలిపెట్టం..
“నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎస్ఆర్ఎస్సీ) నివేదిక ప్రకారం 44 ఏండ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయి. ఇందులో అనేక చెరువులు 60 శాతం, 80 శాతం, కొన్ని చోట్ల వందకు వంద శాతం కబ్జాలకు గురయ్యాయి. ఆక్రమణలు అడ్డుకోకపోతే హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎక్కువగా 60 శాతం పైగా చెరువులు కబ్జాకోరల్లో ఉన్నాయి. వాటిపై విడతల వారీగా చర్యలు తీసుకోబోతున్నాం. పేదవాళ్ల ముసుగులో కబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. త్వరలోనే హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానున్నది”.
-ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
‘చెరువులు, నాలాలు, పార్కులు, ఖాళీ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే బాధ్యులపై చర్యలు తప్పవు. కబ్జాలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు భూ కబ్జాలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
బుద్ధభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైడ్రా కార్యాచరణపై కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. మూడు దశల్లో కార్యాచరణ రూపొందించుకొని హైడ్రా పనిచేస్తుందని వివరించారు. తొలి విడతలో చెరువులు, నాలాలు, పార్కుల్లో కొత్తగా కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫోకస్ పెడుతామని, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక సిబ్బందితో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, కాలనీల సహకారం తీసుకుంటామని చెప్పారు.
స్థానిక ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రెండో విడతలో అప్పటికే ఏర్పడిన భవన, వ్యాపార నిర్మాణాలపై దృష్టి సారిస్తామని, అక్రమ నిర్మాణాలను సమూలంగా కూల్చివేసి.. భవిష్యత్‌లో కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తామన్నారు. మూడో విడతలో చెరువుల పరిరక్షణలో భాగంగా బెంగళూరు తరహాలో చెరువులను సుందరీకరణ చేసి పునర్జీవం పోస్తామని తెలిపారు. గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తామని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.
లోటస్‌పాండ్, గాజులరామారం, చందానగర్, నందగిరి హిల్స్, పాతనగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామన్నారు. చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాలు, నాలా కబ్జాలపై హైడ్రాకు 40-50 దాకా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, పార్కు స్థలాలు, బఫర్ జోన్లలో భూ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని చోట్ల భవన నిర్మాణం పూర్తి కాకముందే ఓసీ సర్టిఫికెట్లను జారీ చేయడం, బఫర్ జోన్లో ఇరిగేషన్ ఎన్వోసీ లేకుండానే అనుమతులు ఇచ్చారని, బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు.
త్వరలోనే ప్రత్యేక పోలీస్‌స్టేషన్
హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, మూడు జోన్లుగా విభజించి.. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ఏటా హైడ్రాకు రూ.200కోట్ల మేర నిధులు ఇవ్వనుందని, త్వరలోనే 3500 మంది సిబ్బందిని నియమించుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. డీఆర్ఎఫ్తో పాటు కబ్జాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని, హైడ్రా కార్యాచరణలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే ముందు ప్రజలు అన్ని రకాల అనుమతులను పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. కబ్జాలు లేని హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందన్నారు.
కబ్జా కోరల్లో చిక్కిన చెరువుల జాబితా ఇదే..
చెరువు : తగ్గిన విస్తీర్ణం(శాతం)
తుమ్మలకుంట : 100శాతం
పెద్ద చెరువు : 96శాతం
మిర్యాలగూడ చెరువు : 90శాతం
నల్ల చెరువు : 90శాతం
కుంట్లూరు పెద్ద చెరువు : 90శాతం
కొంపల్లి లేక్ – 1 : 88శాతం
ఖాజాగూడ లేక్ : 88శాతం
యాప్రాల్ చెరువు : 86శాతం
గుర్రం చెరువు : 85శాతం
జిల్లెలగూడ లేక్ : 85శాతం
కొంపల్లి లేక్ : 84శాతం
రామాంతాపూర్ చెరువు 1 : 84శాతం
బండ్లగూడ లేక్ : 83శాతం
పల్లె చెరువు : 82శాతం
ఓల్డ్ అల్వాల్ చెరువు : 82శాతం
ఇంజాపూర్ చెరువు : 80శాతం
అల్వాల్ లేక్ : 78శాతం
తూంకుంట లేక్ : 77శాతం
మంత్రాల చెరువు : 76శాతం
దూలపల్లి లేక్ : 76శాతం
పిర్జాదీగూడ లేక్ : 73శాతం
బాతుల చెరువు : 72శాతం
రామకృష్ణాపురం చెరువు : 71శాతం
పెద్దచెరువు : 71శాతం
సల్కం చెరువు : 70శాతం
కౌకూర్ లేక్ : 69శాతం
పెద్ద చెరువు : 69శాతం
సఫిల్‌గూడ లేక్ : 66శాతం
దమ్మాయిగూడ లేక్ : 64శాతం
గుండ్లపోచంపల్లి లేక్-1 : 64శాతం
కౌకూర్ చెరువు : 64శాతం
కప్పల చెరువు : 64శాతం
పోతాయిపల్లి లేక్ : 61శాతం
సాయినగర్ చెరువు : 60శాతం
బోన్ చెరువు : 57శాతం
అన్నరాయన్ చెరువు : 56శాతం
సరూర్‌నగర్ చెరువు : 56శాతం
చెంగిచర్ల లేక్ : 53శాతం
రామాంతాపూర్ చెరువు : 51శాతం
ఓవైసీ లేక్ : 45శాతం
నాగారం లేక్ : 45శాతం
నాగోల్ లేక్ : 41శాతం
దమ్మాయిగూడ చెరువు : 35శాతం
రామ చెరువు : 33శాతం
మీరాలం చెరువు : 32శాతం
జల్పల్లి లేక్ : 31శాతం
గుండ్లపోచంపల్లి లేక్-2 : 30శాతం