ఆ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారు. కేసుల్లో వాటాలు పంచుకున్నారు. వాటిని సెటిల్ చేయడానికి లక్షల రూపాయలు తీసుకున్నారు. చోరీ సొత్తులోను వాటాలు కోరుకున్నారు. అంతేకాకుండా పెద్దసారు పేరు చెప్పి కోట్లల్లో డబ్బులు దండుకున్నారు. ఆ నోటా ఈనోటా ఈ వ్యవహారం పెద్దసారుకు చేరేసరికి వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. సిటీ పోలీస్‌కమిషనరేట్ మొత్తం ఏ పోలీసు నోట విన్నా ఇదే చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు అధికారులు కలిసినా వీరి గురించే మాట్లాడుకుంటూ ఇలా చేసిన పెద్దసారు కేవలం బదిలీలతోనే సరిపెట్టేశారేంటా అంటూ చర్చించుకుంటున్నారు.
-సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)
నగరంలో ప్రముఖులు నివాసముండే ఈ జోన్లో అధికారులు ఒకవైపు కత్తిమీద సాములా పనిచేస్తూనే మరోవైపు రెండుచేతులా దండుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రెండు మూడు పీఎస్‌లకు వచ్చేవారికి మాత్రం కాసుల పంట పండుతూనే ఉంటుందట. అటువంటి పీఎస్‌కు సంబంధించిన ఓ ఉన్నతాధికారి, జోన్‌స్థాయి అధికారితో కలిసి చేసిన దందా ఇప్పుడు కమిషనరేట్ మొత్తం గుప్పుమంటుంది. ఇద్దరూ వచ్చి కొద్ది కాలమే అయినా ఇద్దరిది ఒకే దారి కావడంతో ఎక్కడ కేసులు వస్తే అక్కడ చేతివాటం ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. ఆ జోన్ అధికారికి పెద్దసారు ఇరవై సంవత్సరాల పరిచయం కావడంతో ఇక వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. గతంలో ఈ జోన్లో పనిచేసిన అధికారి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరుండడంతో కిందిస్థాయి అధికారుల పప్పులు ఉడకలేదు. తర్వాత వచ్చిన అధికారి మీరు తీసుకోండి.. నాకు తెచ్చివ్వండి అంటూ చెప్పడంతో ఇక వారి సంతోషానికి అవధులు లేవు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జోన్ అధికారికి వాటాలు తెచ్చిస్తున్నారు. వచ్చిన ఆరునెలల్లోనే ఆరుసార్లు కెఫెటేరియా వారితో మీటింగులు, పబ్బులు, బార్లు, షాపింగ్‌మాల్స్.. ఇలా ఒకటేమిటి.. అన్నిచోట్ల నుంచి కావలసినంత దండుకున్నారు.
ఆ జోన్లో ఉండే ప్రధాన సెటిల్మెంట్లలో ఈ ఇద్దరు అధికారులు వాటాలు పంచుకున్నట్లు కమిషనరేట్‌లో మాట్లాడుకుంటున్నారు. ఏదైనా కేసులో నిందితుల ఇండ్లలో తనిఖీలు చేసే సమయంలో విలువైన వస్తువులు చోరీ చేయడానికి కూడా ఈ ఇద్దరు అధికారులు పరోక్షంగా సహకరించినట్లు వెలుగుచూడడంతో వాటినుంచి తమ పేర్లు బయటకు రాకుండా ఉండటానికి చిన్నస్థాయి పోలీసులను కేసులో ఇరికించి వారు సైడయ్యారంటూ జోన్లో ఉన్న పోలీసులు చెప్పుకుంటున్నారు. ఓ కేసుతో వారి వ్యవహారమంతా రివర్సయిందని చర్చ జరుగుతోంది. సినీ ఇండస్ట్రి పరిధిలో జరిగిన ఓ కేసులో సినీ ప్రముఖుడితో ఈ ఇద్దరు అధికారులు మిలాఖత్ అయ్యారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సినీ ప్రముఖుడు తనపై ఎలాంటి చర్యలు ఉండకుండా తన పరువు పోకుండా చూడాలంటూ మధ్యవర్తి ద్వారా వీరిని కలువగా.. తనకు అనుకూలమైన ఆ స్టేషన్ అధికారిని మాట్లాడమంటూ జోన్ అధికారి పురమాయించాడనే చర్చ జరుగుతోంది. ఆయనకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కేసులో కొన్ని మార్పులు చేర్పులూ చేయాలని, సినిమా స్టార్లకు ఈ మధ్య జరుగుతున్న హడావిడి మాదిరి కావద్దంటే పెద్ద సారు ఒప్పుకోవాలంటూ ఒప్పందం చేసుకున్నారు. పెద్దసారు పేరు చెప్పి లక్షల రూపాయలు తెచ్చుకున్నారని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.