కొండాపూర్, నవంబర్ 22 : చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ (Papireddy Colony)లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ (Cordon Search) చేపట్టారు. అనంతరం కాలనీవాసులతో కమ్యునిటీ కనెక్ట్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్(DCP Riti Raj) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఎస్ఓటీ, ఉమెన్ సేఫ్టీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు 250 ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.
ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాపిరెడ్డి కాలనీలో చాలామంది నివసిస్తున్నట్లు కార్డన్ సెర్చ్‌లో పోలీసులు గుర్తించారు. కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్లో 635 మద్యం బాటిళ్లు, వివిధ షాపుల్లో నిషేదించిన 122 విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో 9 మంది అనుమానిత వ్యక్తులతో పాటు నలుగురు రౌడీ షీటర్లను గుర్తించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లులేని 51 బైకులు, రెండు ఆటోలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఏడీసీపీ ఉదయ్‌రెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.