వికారాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కాన్పు కోసం ప్రైవేట్ దవాఖాన కెళ్తే సిజేరియన్లు చేస్తున్నారు. కాసుల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 వరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లుండగా.. సిటీస్కాన్, ల్యాబ్‌లు, స్కానింగ్, ఎక్స్‌రే సెంటర్లు కలిపి దాదాపుగా 20 వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లున్నాయి. వాటిని దవాఖానల నిర్వాహకులే మెడికల్ షాపులకు అనుబంధంగా నడుపుతూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
ఒక్కో సీజేరియన్‌కు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు లాగుతున్నారని.. జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో జరిగే ప్రసవాల్లో దాదాపు 80 శాతం వరకు ప్రసవాలు సిజేరియన్లే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో కేవలం 20-30 శాతం ప్రసవాలు సిజేరియన్లు జరుగుతుండడం గమనార్హం. జిల్లాలోని చాలావరకు ప్రైవేట్ దవాఖానలకు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో ఉంటున్న ఆర్ఎంపీ, పీఎంపీలు మధ్యవర్తులుగా పనిచేస్తున్నారు. వీరికి తోడుగా విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు.
తమ దవాఖానకు వస్తే అత్యాధునిక సేవలు అందిస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గర్భిణులకు ఒకటో నెల నుంచి మొదలుకొని తొమ్మిదో నెల వచ్చే వరకు ప్రతినెలా స్కానింగ్‌లు, పరీక్షలు చేస్తున్నారు. అత్యధిక మోతాదులో మందులను తినిపిస్తున్నారు. తల్లి కడుపులో బిడ్డ పౌష్టికాహారంతో ఎదగకుండా మందులతో ఎదిగేలా తయారు చేస్తున్నారు.
తల్లి గర్భంలో పిండం కాస్త కదిలితే చాలు స్కానింగ్ తీస్తున్నారు. తక్కువలో తక్కువ ప్రతినెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. అయితే ప్రసవం కోసం నిండు గర్భిణి హాస్పిటల్లో అడుగు పెడితే కత్తికోత పెట్టనిదే బయటికి పంపించడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలను ఆపాల్సిన జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలతో కుమ్మక్కై నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారన్న విమర్శలున్నాయి.
విచ్చలవిడిగా ఆపరేషన్లు…
ప్రైవేట్ దవాఖాలకెళ్తే గర్భిణులకు విచ్చలవిడిగా ఆపరేషన్లు చేస్తున్నారు. స్కానింగ్ తీయడం, బిడ్డ అడ్డం తిరిగిందని, రక్తం తక్కువగా ఉందని, పేగులు మెడకు చుట్టుకున్నాయని, ఆపరేషన్ చేయకుంటే తల్లికీబిడ్డకు ప్రమాదం అని రకరకాల కారణాలు చెప్పి పేషెంట్లు, వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేస్తూ డాక్టర్లు తమకు తాముగా డిమాండ్ పెంచుకుంటున్నారు.
జిల్లాలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ దవాఖానల్లో గడిచిన 10 నెలల్లో 2,970 ప్రసవాలు జరుగగా వీటిలో 2,331(80%) ప్రసవాలు శస్త్ర చికిత్సల ద్వారానే జరిగాయి. నార్మల్ డెలివరీలు కేవలం 639 (20%)గా ఉన్నది. ఇదే క్రమంలో ప్రభుత్వ దవాఖానల్లో గత పది నెలల్లో 5,261 ప్రసవాలు జరుగగా కేవలం 1,779 ప్రసవాలు మాత్రమే సిజేరియన్లు జరిగాయి. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకెళ్తే బిల్లుల మోత మోగిస్తున్నారు.
గర్భిణులు దవాఖానల్లో అడుగు పెట్టగానే ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ.4 వేలు, మత్తు మందు వైద్యుడి పేరుతో రూ.2 వేల రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్ మెడిసిన్ కిట్‌కు రూ.4వేల నుంచి రూ.5 వేల వరకు , దవాఖాన నుంచి బయటి కొచ్చేటప్పుడు బెడ్చార్జి, రూమ్, సర్వీస్ చార్జీలు, ఆస్పత్రి మెయింటెనెన్స్, పవర్బిల్లులు అన్నీ కలిపి రూ.60 నుంచి రూ.1,00,000 వరకు సమర్పించుకోనిదే తల్లీబిడ్డ ప్రైవేట్ దవాఖాన నుంచి ఇంటికి చేరే పరిస్థితి లేదు.
కాగా సాధారణ ప్రసవానికి ఇన్వెస్టిగేషన్ పేరుతో రూ.5 వేలు, మెడిసిన్ కోసం రూ.3 వేలు, మెయింటెనెన్సు, రూమ్ సర్వీసు, బెడ్చార్జి, ఇతరత్రా అన్ని చార్జీలు కలిపి రూ. 30,000-రూ. 50,000 బిల్లు చేస్తున్నారు. అంటే సాధారణ ప్రసవానికి కూడా రూ.50 వేల వరకు బిల్లు చేయనిదే ప్రైవేట్ దవాఖానల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయాల్సిన జిల్లా వైద్యారోగ్య శాఖ యం త్రాంగం ఫిర్యాదు చేస్తే వెళ్లి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.