Tejas Crash : దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలడంతో మరణించిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal)కు భారత వాయుసేన (IAF) నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా అధికారులు వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం, ఆయనలోని అసాధారణ నైపుణ్యాలను కొనియాడారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన పైలట్ నమాన్ష్ వృత్తి నిబద్ధత గురించి ఐఏఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
‘శుక్రవారం జరిగిన ప్రమాదంలో పైలట్ నమాన్ష్ స్యాల్ దుర్మరణం చెందడం బాధాకరం. దురదృష్టవశాత్తూ దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పైలట్ నమాన్ష్ అంకితభావమున్న పైలట్. తన కెరీర్ ఆసాంతం ఆయన దేశంకోసం అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన అసాధారణ ప్రజ్ఞాశీలి. ఉద్యోగం విషయంలో రాజీపడేవారు కాదు. తనదైన వృత్తి నిబద్ధతతో నమాన్ష్ అందరి మన్ననలు పొందారు.
The Indian Air Force deeply mourns the tragic loss of Wg Cdr Namansh Syal, who lost his life in the unfortunate Tejas aircraft accident at the Dubai Air Show.
A dedicated fighter pilot and thorough professional, he served the nation with unwavering commitment, exceptional skill… pic.twitter.com/1XytMiFWsG— Indian Air Force (@IAF_MCC) November 22, 2025
దేశ సేవకే ఆయన జీవితాన్ని అంకితమిచ్చారు. యూఏఈ అధికారులు, భారత రాయబార కార్యాలయం సిబ్బందితో పాటు ఆయన సన్నిహితులు, స్నేహితులు.. నమాన్ష్‌కు వీడ్కోలు పలకడంతో ఈ విషయం అర్దమవుతుంది. ఈ బాధకరమైన సమయంలో నమాన్ష్ కుటుంబానికి ఐఏఎఫ్ అండగా ఉంటుంది. ఆయన సేవలు అజరామరం’ అని ఎక్స్ పోస్ట్‌లో ఐఏఎఫ్ పేర్కొంది.
భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలింది. వింగ్ కమాండర్ నలాన్ష్ నడిపిన ఆ విమానం మధ్యాహ్నం 3:40 గంటలకు దట్టమైన పొగతో కిందపడింది. చివరి నిమిషం వరకూ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు పైలట్ ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయనవల్ల కాలేదు.
‘దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొన్న భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రమైన గాయాలు కావడంతో పైలట్ మృతి చెందాడు. ఆయన మరణం పట్ల ఐఏఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఐఏఎఫ్ అన్ని విధాలా అండగా ఉంటుంది. ఈ ప్రమాదానికి కారణాలతో పాటు పైలట్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తాం’ అని ఐఏఎఫ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.