మొయినాబాద్, నవంబర్ 21 : హైదరాబాద్-బీజాపూర్ హైవేపై మీర్జాగూడ వద్ద టిప్పర్-ఆర్టీసీ బస్సు ప్రమాదం మరవక ముందే శుక్రవారం ఉద యం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్యాబ్ డ్రైవర్ అతివేగం..నిర్లక్ష్యంగా సింగిల్ రోడ్డులో రాం గ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెం దగా.. ఓ ఫొటోగ్రాఫర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం..తాండూరుకు చెందిన వంశీధర్‌రెడ్డి అనే దంత వైద్యుడు తన బంధువులు సుజాత, రోజా, డ్రైవర్ వెంకట్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. కాగా, ఏపీలోని అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం ప్రాంతానికి చెందిన కరీమ్(37)అనే డ్రైవర్ హైదరాబాద్‌లో క్యాబ్ నడుపుతూ జీవిస్తున్నాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన లోకేశ్(24), జగద్గిరిగుట్టకు చెం దిన బాబురావు, కుత్బుల్లాపూర్‌కు చెందిన షేక్ అకిల్లు ఫొటో,వీడియోగ్రాఫర్లుగా పని చేస్తున్నా రు.
వారు మండలంలోని కనకమామిడి రెవెన్యూలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ (గుల్మొర్) రిసార్టులో జరుగుతున్న ప్రోగ్రామ్‌ను షూట్ చేయడానికి వెళ్లేందుకు కరీమ్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. వారు ముగ్గురు కలిసి ఆ క్యాబ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌కు వెళ్తుండగా మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రం -కనకమామిడి గేట్ మధ్యలో ఉన్న డ్రైవ్ ఇన్ దాబా (పెంటయ్య హోటల్) వద్ద ఎదురుగా తాం డూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దంత వైద్యు డు వంశీధర్‌రెడ్డి కారును క్యాబ్ డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లి బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ కారులో ఇరుక్కుని దుర్మరణం చెందగా కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్ లోకేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిని బాబురావు, షేక్ అకిల్లకు తీవ్ర గాయాలు కాగా.. డాక్టర్ వంశీధర్‌రెడ్డి డ్రైవర్ వెంకట్‌కు పక్కటెముకలు విరిగాయి.
వంశీధర్‌రెడ్డి, ఇద్దరు మహిళలకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జుఅయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దవఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
అతివేగమే ప్రాణాలు తీసింది..
క్యాబ్ డ్రైవర్ అతి వేగమే ప్రాణాలను తీసిందని ఆ క్యాబ్‌లో ప్రయాణించిన మిగిలిన ఇద్దరు ఫొటో, వీడియోగ్రాఫర్లు తెలిపారు. అతి వేగంగా వెళ్లొద్దని నెమ్మదిగా వెళ్లాలని ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు.