BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసులు అనుమతులు జారీ చేశారు. బీసీ మహాసభ కోసం తెలంగాణ జాగృతి ఏర్పాట్లు పూర్తి చేసింది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభ నిర్వహించ తలపెట్టగా.. అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని.. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నీరంకుశత్వం ఎందని ప్రభుత్వ తీరును తీవ్రంగా బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి మాట్లాడారు. సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నామని.. సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్‌తో సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ నిర్వహణ కోసం కవిత గురువారం బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు సైతం మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. జనాభా ధామాషా ప్రకారం 60 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని చేస్తున్న డిమాండ్‌ను తాము సమర్థిస్తున్నామన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి భారీగా తరలి ఇందిరా పార్క్ బీసీ మహాసభకు హాజరవుతామని ప్రకటించారు.