మెహిదీపట్నం అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్ ఓయూ కాలనీలో గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్, నాయకులు రాములు, సోమాచారి, సత్యం తదితరులు ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు, ఎన్నికల సిబ్బంది వచ్చి ప్రచారం చేయవద్దంటూ అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని జీవన్ సింగ్ ఆరోపించారు. ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుయుక్తులు పన్నుతుందని ఆయన విమర్శించారు.
ఎన్నికల తనిఖీల్లో అధికారుల పక్షపాతం
జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలలో పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు.. నేతలు పంచే డబ్బు, ఆభరణాలు, వస్తువులను ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులతో పాటు అక్కడక్కడ పోలీసులు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాల్సిన తనిఖీ బృందాలు.. బీఆర్ఎస్ నాయకులనే లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారని , అధికార పార్టీ నాయకుల వైపు కన్నెత్తి చూడటం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఇష్టానుసారంగా వందలాది మందితో తిరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు.. తనిఖీ బృందాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.