Harish Rao | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఈరోజు జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒక పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యమన్నారు.
గత నెల మే 16న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు నిందితుడికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. నెలరోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఈ రోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడు. మాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. సరైన సమయంలో ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిలో సమీక్ష చేసి, కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే ఈ రోజు ఈ ఆరు హత్యలు జరిగేవి కావన్నారు హరీశ్ రావు .
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. కళ్లు తెరువని ముగ్గురు పసిపిల్లలతోపాటు అత్యాచారానికి గురైన బాలికను, ఆమె చెల్లెల్ని, తల్లిని, నాయనమ్మను చంపేశాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో కేవలం ఒకే ఒక అమ్మాయి మిగిలింది. ఆ అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు, నడవలేని వికలాంగురాలు. పూర్తిగా కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికే ఆ చిన్నారి బాగోగులు చూసేందుకు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ మిగిలిలేరు. ఆ అమ్మాయి భవిష్యత్తు తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందన్నారు .
ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా..
ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని హరీశ్ రావు మండిపడ్డారు. అత్యాచారం చేసి, ఆరుగురిని చంపిన కరుడు గట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్న పోలీసులు.. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడానికి మాత్రం నిమిషాల్లో స్పందిస్తున్నారు.
బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డిని, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని స్పెషల్ టీమ్‌లు పెట్టి మరీ ఇంటి దగ్గరే అరెస్ట్ చేయించారు. ఓదార్పు కోసం వెళ్తున్న నాయకులను నేరస్తుల్లా చూస్తున్న ఈ ప్రభుత్వం.. నేరస్తులను మాత్రం వదిలేస్తోంది.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు.
మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారుడు శశిధర్ రెడ్డి ఏమో మాది ఖాకీ బుక్ అంటారు.. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ ఏమో మావోయిస్టులు మంచోళ్లు అంటారు. ఈ మాటలు చెబుతున్న అధికారులు నేరాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు..? నైతిక విలువలు ఉంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన వికలాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం వెంటనే రూ. కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఆ అమ్మాయిని పెంచి, సంరక్షించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. పరామర్శకు వెళ్తూ అరెస్టయిన బీఆర్ఎస్ మహిళా నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.
Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని