PM Modi : భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక గమ్యస్థానమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్‌గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక అని ప్రధాని అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ (India-New Zealand) వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకు వచ్చింది. ఇది పెట్టుబడి మాత్రమే కాదని, భారత్ వృద్ధి ప్రయాణంలో భాగం కావాలనే నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే భారత్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 100 నగరాల్లో ఎనిమిది వేలకు పైగా ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని చెప్పారు.
పట్టణ రవాణా, నీరు, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో భాగం కావాలని న్యూజిలాండ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఆ దేశ యూనివర్సిటీలను కోరారు.