Hyderabad | సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
☞ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దు.
☞ చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.
☞ కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ముట్టుకోరాదు.
☞ వర్షం వల్ల వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉంది. పరిమిత వేగంతో వాహనాలు నడుపాలి.
☞ అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి.
☞ అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ 040-21111111, 9000113667ను సంప్రదించాలి.